Share News

పోలింగ్‌ నిర్వహణలో వైఫల్యం

ABN , Publish Date - May 15 , 2024 | 01:32 AM

రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఇక్కడ ఏమి జరిగినా విశేషమే.

పోలింగ్‌ నిర్వహణలో వైఫల్యం

ఈసారి ఓటు వేసేందుకు దేశ, విదేశాల నుంచి రాక

అయినప్పటికీ జిల్లాలో ఊహించిన స్థాయిలో పెరగని పోలింగ్‌ శాతం

బూత్‌ల ఏర్పాటులో అమలు కాని రేషనలైజేషన్‌

కొన్నిచోట్ల తక్కువ మంది, మరికొన్నిచోట్ల ఎక్కువ మంది ఓటర్లు

ప్రక్రియ వేగవంతంపై దృష్టిపెట్టని సిబ్బంది

గంటలకొద్దీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి

దాంతో వెనుతిరిగిన వేలాది మంది...?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఇక్కడ ఏమి జరిగినా విశేషమే. విద్యావంతులు అధికం. అటువంటి జిల్లాలో ఓటింగ్‌ శాతం భారీగా పెరగాలి. ఈసారి ఓట్లు వేసి, తాము ఎవరి వైపు ఉన్నామో చాటాలని విశాఖ ప్రజలు ఉపాధి రీత్యా దూరప్రాంతాల్లో ఉన్నా సెలవు పెట్టి మరీ వచ్చారు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దిగిపోయారు. యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఆరోగ్యం సహకరించకపోయినా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. అయినా పెద్దగా ఓటింగ్‌ శాతం పెరగలేదు. కనీసం 75 శాతం దాటుతుందని అంతా భావించారు. రాత్రి 12 గంటలు దాటినా కొన్నిచోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగింది. మరి ఓటింగ్‌ శాతం ఊహించిన స్థాయిలో ఎందుకు పెరగలేదని ఆరా తీస్తే...అనేక లోపాలు కనిపిస్తున్నాయి.

జిల్లా అధికారులు పోలింగ్‌ వరకూ ఏర్పాట్లు చేసినా, వచ్చిన వారికి వీలైనంత వేగంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రధాన అంశంగా తీసుకోలేదు. విశాఖ నగరంలో ఓటు వేయడానికి అత్యధికంగా నాలుగున్నర గంటల సమయం పట్టింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన వారు మాత్రమే కాస్త తక్కువ వ్యవధిలో ఓట్లు వేసి బయటకు వచ్చారు. ఎనిమిది గంటల తరువాత వెళ్లిన వారికి అధమంగా రెండు గంటల సమయం పట్టింది. తీవ్రమైన ఉక్కపోత, కొన్నిచోట్ల నీడ లేని దుస్థితి, తాగడానికి మంచినీరు, అత్యవసరం అయినప్పుడు మహిళలు వినియోగించుకోవడానికి మరుగుదొడ్లు లేకపోవడంతో గంటల కొద్దీ ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

సక్రమంగా అమలు కాని రేషనలైజేషన్‌

నియోజక వర్గాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, వాటిలో ఎక్కడ, ఎంతమందికి అవకాశం కల్పించాలనే దానిపై అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఉదాహరణకు తూర్పు నియోజకవర్గంలో కృష్ణా కాలేజీనే తీసుకుంటే అక్కడ భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వాటికి ఓటర్ల కేటాయింపులో రేషనలైజేషన్‌ పాటించలేదు. ఒక కేంద్రానికి 500 మంది ఓటర్లను కేటాయిస్తే, పక్కనే ఉన్న మరో కేంద్రానికి 1,400కి పైగా ఓటర్లను కేటాయించారు. దాంతో కొన్ని పోలింగ్‌ కేంద్రాలు సాయంత్రం 4 గంటలకే ఖాళీ కాగా...పక్కనే ఉన్న కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ జరుగుతూనే ఉంది. దీనిపైనే ఓటర్లు తీవ్ర నిరసన, అభ్యంతరం వ్యక్తంచేశారు. అత్యధిక ఓటర్లను కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల వద్ద గంటలకొద్దీ జనాలు బారులుతీరి కనిపించారు. కొందరు క్యూలో నిల్చోలేక దండం పెట్టి వెనక్కి వెళ్లిపోయారు. పోలీసుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన వారు మధ్యలో దూరిపోవడంతో గందరగోళం ఏర్పడింది. దీనిని నిరసిస్తూ మరికొందరు ఓట్లు వేయకుండానే వెళ్లిపోయారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారితో పూర్తిగా ఓట్లు వేయించుకోవడంలో యంత్రాంగం విఫలమైంది.

ఎంపీ ఓటు వేసినప్పుడు ఆలస్యం

ప్రతిచోట ఎంపీ అభ్యర్థికి ఓటు వేసినప్పుడు బాగా ఆలస్యం జరిగింది. విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు నిల్చొన్నారు. దాంతో అధికారులు మూడు ఓటింగ్‌ యంత్రాలను పెట్టాల్సి వచ్చింది. కాస్త అవగాహన కలిగినవారు రెండు, మూడు సెకండ్లలో ఓటు వేసేశారు. కానీ నిరక్షరాస్యులు, వృద్ధుల విషయంలోనే అధిక జాప్యం జరిగింది. మూడు ఈవీఎంలు ఒకటికి రెండుసార్లు చూడడం, ఆ తరువాత నిర్ణయం తీసుకొని బటన్‌ నొక్కడం వల్ల జాప్యం జరిగింది. ఎంపీ ఓటు వేయడానికే అత్యధికులు రెండు నిమిషాల సమయం తీసుకున్నారు. దాంతో పోలింగ్‌ ప్రక్రియ నత్తనడకన సాగింది. కొందరు ఆర్‌ఓలు చొరవ తీసుకొని త్వరత్వరగా ఓటర్లను బయటకు పంపించారు. మరికొందరు ఆర్‌ఓలు ఓటింగ్‌ ప్రక్రియ త్వరగా జరిపించాలనే దానిపై దృష్టిపెట్టలేదు. అన్ని నియోజకవర్గాల్లోను ఇలాంటి అధికారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు.

గత ఎన్నికలతో పోల్చుకుంటే పెరిగిన చైతన్యం, భారీగా తరలివచ్చిన ఓటర్ల కారణంగా పోలింగ్‌ శాతం భారీగా పెరగాలి. కానీ అలా జరగలేదు. తొలిసారి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినవారు వెనక్కి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. భవిష్యత్తులోనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సి ఉంది.

- ఇకపై జరిగే ఎన్నికలకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి తేవాలని అత్యధికులు కోరుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల ఇది సాధ్యపడుతుందని, ఎన్నికల నిర్వహణకు ఇన్ని వందల కోట్ల రూపాయల వ్యయం కూడా పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - May 15 , 2024 | 07:56 AM