Share News

‘బాల్య వివాహాలను అరికట్టడంలో విఫలం’

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:42 AM

బాల్య వివాహాలను అరికట్టడంలో సచివాలయం మహిళా పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు సీతారాం ఆరోపించారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, 2023 నిబంధనలపై డివిజన్‌ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

‘బాల్య వివాహాలను అరికట్టడంలో విఫలం’
సమగ్ర బాలల పరిరక్షణ పథకం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

నర్సీపట్నం, ఫిబ్రవరి 29: బాల్య వివాహాలను అరికట్టడంలో సచివాలయం మహిళా పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు సీతారాం ఆరోపించారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, 2023 నిబంధనలపై డివిజన్‌ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2025 నాటికి బాల్య వివాహాలు నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బాల్య వివాహాలు అరికట్టడంలో సచివాలయంలోని మహిళా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. బాల్య వివాహం ఆపినట్టు కాగితాల్లో చూపుతున్నారని, అదే వివాహం పక్క ఊర్లోనో... గుడిలోనో జరిగిపోతుందని చెప్పారు. ఈ విధంగా 13 అనధికార వివాహాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలపై ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్య వివాహాల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే భయపడవద్దని సూచించారు. ఐసీడీఎస్‌ పీడీ అనంతలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు నెలల్లో 86 బాల్య వివాహాలను ఆపామని తెలిపారు. ఆర్డీవో హెచ్‌వీ జయరాం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టాలని సూచించారు. మంచి విద్య అందిస్తే ఏ పథకాలు, ఎవరి మీద ఆధారపడే పరిస్థితి రాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో మేరీ సువార్త, ఎంఈవో తలుపులు, సీడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:42 AM