వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ విస్తరణ
ABN , Publish Date - Oct 05 , 2024 | 01:39 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్ ప్లాన్‌ను విస్తరించనుంది.
అనకాపల్లి జిల్లాలో 12 మండలాలకు...
విజయనగరం జిల్లాలో ఒక మండలం...
అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పన
గ్లోబల్ టెండర్ల ద్వారా ఏజెన్సీ ఎంపిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్ ప్లాన్‌ను విస్తరించనుంది. ఇంతకు ముందు మాస్టర్ ప్లాన్-2021-2041ను రూపొందించినప్పుడు అనకాపల్లి జిల్లాలోని 12 మండలాలను, విజయనగరం జిల్లాలో మెరకముడిదాం మండలాన్ని అందులో చేర్చలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాపై దృష్టిసారించింది. అభివృద్ధికి వీలుగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని వీఎంఆర్‌డీఏను ఆదేశించింది.
అనకాపల్లి జిల్లాలో 24 మండలాలు ఉండగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న వాటినే గతంలో మాస్టర్‌ప్లాన్ తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. మరోవైపున ఉన్న వాటిని పట్టించుకోలేదు. అందులో నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రావికమితం, రోలుగుంట, దేవరాపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, కె.కోటపాడు మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో కలుపుతూ మాస్టర్ ప్లాన్ తయారుచేయాల్సి ఉంది.
నాడు రూ.10 కోట్ల వ్యయంతో
వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2021-2041ను రూ.10 కోట్ల వ్యయంతో రూపొందించారు. 2011లో అధ్యయనానికి శ్రీకారం చుట్టి 2016లో లీ అసోసియేట్స్ సంస్థకు బాధ్యత అప్పగించారు. దానికి ఆ సంస్థ రూ.10 కోట్లు వసూలుచేసింది. వైసీపీ ప్రభుత్వం త్వరగా మాస్టర్ ప్లాన్ పూర్తిచేయాలని ఒత్తిడి పెట్టడంతో పూర్తికాకపోయినా సరే 2021లో సమర్పించేసింది. దాంతో అనకాపల్లి జిల్లాలో 12 మండలాలు, అటు మెరకముడిదాం మండలానికి ప్రణాళికలు రూపొందలేదు. అయితే వాటికి సంబంధించిన ఫొటోలు, సమాచారం ఆ సంస్థ సేకరించి పెట్టుకుంది. ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే తనకు నష్టం వచ్చిందని, ఇంకో నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే వాటికి మాస్టర్ ప్లాన్ తయారుచేస్తానని చెబుతోంది. దాంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
ప్రణాళికలో ఏముంటాయి?
ఆయా మండలాల్లో ఉన్న వనరులు, నీటి సదుపాయం, పంటలు, పరిశ్రమలు, జనాభా, విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమలు, రహదారులు, రైలు మార్గాలు, వాటి మధ్య అనుసంధానం, ట్రాఫిక్ ఇలాంటివన్నీ అధ్యయనం చేస్తారు. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ తరహా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయవచ్చునో సూచించి, వాటికి ఆ ప్రాంతాలను కేటాయిస్తారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు, ఆస్పత్రులు, స్టేడియాలు, కొత్త రహదారులు, వాటి మధ్య అనుసంధానం, అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణం, సరకు రవాణాకు వీలుగా కారిడార్లు వంటివి అందులో ఉంటాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రహదారులను వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలకు భూములు కేటాయిస్తారు. పారిశ్రామిక పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు వంటివి వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక అంతా అందులో ఉంటుంది.
గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంపిక
విశ్వనాథన్, కమిషనర్, వీఎంఆర్‌డీఏ
రాష్ట్ర ప్రభుత్వం ఆయా మండలాలు కూడా వీఎంఆర్‌డీఏలో ఉన్నందున మాస్లర్‌ప్లాన్‌ను విస్తరించాల్సిందిగా సూచించింది. దీనికి గ్లోబల్ టెండర్ల ద్వారా ఏజెన్సీని ఎంపిక చేయాలని అనుకుంటున్నాము. దీనివల్ల తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో ప్రభావవంతమైన ప్రణాళిక తయారువుతుందని భావిస్తున్నాము. త్వరలోనే టెండర్లు పిలుస్తాం.