Share News

విస్తరణ ఒట్టిమాటే!

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:55 AM

జిల్లా కేంద్రం అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ జంక్షన్‌ విస్తరణపై జీవీఎంసీ యంత్రాంగం, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ప్రకటనలు బూటకమేనని తేలిపోయింది. గత ఏడాది ఆగస్టులో ఈ జంక్షన్‌ను 80 అడుగుల మేర విస్తరిస్తామంటే ఆర్భాటంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రధాన కూడలిలో అవస్థల మధ్య పట్టణవాసులు రాకపోకలు సాగిస్తున్నారు.

విస్తరణ ఒట్టిమాటే!
అనకాపల్లి ఎన్టీఆర్‌ జంక్షన్‌

అభివృద్ధికి నోచుకోని ఎన్టీఆర్‌ జంక్షన్‌

ఏడాది గడిచినా చర్యల్లేవ్‌

ఆర్భాటంగా ప్రకటించిన జీవీఎంసీ యంత్రాంగం

పైసా విదల్చలేంటున్న స్థానికులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 11:

జిల్లా కేంద్రం అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ జంక్షన్‌ విస్తరణపై జీవీఎంసీ యంత్రాంగం, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ప్రకటనలు బూటకమేనని తేలిపోయింది. గత ఏడాది ఆగస్టులో ఈ జంక్షన్‌ను 80 అడుగుల మేర విస్తరిస్తామంటే ఆర్భాటంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రధాన కూడలిలో అవస్థల మధ్య పట్టణవాసులు రాకపోకలు సాగిస్తున్నారు.

అనకాపల్లిలో ఎన్టీఆర్‌ జంక్షన్‌ కీలకమైనది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి ఈ మార్గంలోనే చేరుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న కూడలిని ప్రస్తుతం ఉన్న 40 అడుగుల వెడల్పు నుంచి 80 అడుగులకు విస్తరిస్తామని గత ఏడాది ఆగస్టులో జీవీఎంసీ అధికారులు, స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కొద్దిరోజుల్లో పనులు ప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు తొలగిపోతాయని పట్టణవాసులు భావించారు. అయితే ఏడాది సమీపిస్తున్నా ఇప్పటివరకు జంక్షన్‌ విస్తరణపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ రహదారికి ఎడమ పక్కన యల్లయ్య కాలువ ఉండడంతో విస్తరణలో భాగంగా ఆ కాలువపై కాంక్రీట్‌ శ్లాబు నిర్మిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న రహదారిలో, ఎన్టీఆర్‌ స్టేడియానికి ఆనుకుని ఉన్న బడ్డీలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తామని కూడా చెప్పిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా దానిని తొమ్మిది అడుగులకు పెంచి, రౌండ్‌ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని, వాహనాలు మలుపు తిరిగే సమయంలో ఎటు వంటి ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు అవసరమైన అంచనాలు తయారుచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పట్లోనే సూచించారు. ప్రస్తుతం ఈ జంక్షన్‌లో ఇరుకుమయంగా మారింది. విస్తరణ చేపడితే సమస్యలు తొలగిపోతాయని పట్టణ వాసులు భావిస్తున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం

ఎన్టీఆర్‌ జంక్షన్‌ విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రతాపాదనలు ఉన్నాయి. అయితే యల్లయ్య కాలువకు ఆనుకుని ఓ భవనం ఉంది. దానివల్ల సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అయితే అన్ని సమస్యలను పరిష్కరించి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

-వేణుగోపాలరావు, డీఈ, జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం

Updated Date - Jun 12 , 2024 | 12:55 AM