Share News

ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 01:19 AM

ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టరు ఎ.మల్లికార్జున తెలిపారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌

జిల్లాలో 20,12,373 ఓటర్లు

1991 పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు నిషేధం

ప్రతి బూత్‌లో మూడు క్యూలైన్లు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టరు ఎ.మల్లికార్జున తెలిపారు. మొత్తం 20,12,373 మంది ఓటర్ల కోసం 1,991 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ 13వ తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుందన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 11 రకాల కనీస వసతులు కల్పించామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించామన్నారు. ఎన్నికల నిర్వహణకు 13,069 మంది సిబ్బందిని నియమించామన్నారు. అందులో 2,183 మంది పీవోలు, 2,192 మంది ఏపీవోలు, 8,694 ఓపీవోలు ఉన్నారని తెలిపారు.

పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 22 ఏఆర్వోలు, 21 మంది నోడల్‌ అధికారులను నియమించామన్నారు. జిల్లాలో 152 సెక్టార్లు, 207 రూట్లు ఉన్నాయని, వీరి ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాలకు మెటీరియల్‌ తరలిస్తామన్నారు. విశాఖ పార్లమెంటు ఎన్నికల బరిలో 33 మంది ఉన్నందున మూడు బ్యాలెట్‌ యూనిట్లు, విశాఖ దక్షిణలో రెండు బ్యాలెట్‌ యూనిట్లు, మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క బ్యాలెట్‌ యూనిట్‌ ఉంటాయన్నారు. ఇందుకోసం మొత్తం 9,627 బ్యాలెట్‌ యూనిట్లు (ఈవీఎంలు), 4,681 కంట్రోల్‌ యూనిట్లు, 5,040 వీవీ ప్యాట్లు కేటాయించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పురుషులు, మహిళలు, విభిన్న ప్రతిభావంతులు/వృద్ధులకు వేర్వేరుగా మూడు క్యూలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. పోలింగ్‌ ప్రారంభ సమయానికి 48 గంటలు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం నిలిపివేయించడం జరిగిందన్నారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు వీధుల్లో నలుగురికు మించకుండా ప్రచారం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు అనుమతించేది లేదని కలెక్టర్‌ స్పష్టంచేశారు. ఓటర్లంతా తమ ఫోన్లు ఇంటి వద్ద ఉంచి ఓటేయడానికి రావాలని కోరారు. జిల్లాలో 94 శాతం వరకు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశామని, స్లిప్పుతో ఓటేయడానికి రావాలన్నారు. ఒకవేళ స్లిప్పు లేకపోయినా ఎపిక్‌ కార్డు తీసుకుని వస్తే పోలింగ్‌ కేంద్రంలో పీవోకు ఒక డిక్లరేషన్‌ ఇచ్చి ఓటు వేసుకోవచ్చునన్నారు.

నేడు ఏయూలో ఈవీఎంలు పంపిణీ

ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాలకు మెటీరియల్‌ తరలింపునకు 700 వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత తిరిగి ఏయూలో స్ట్రాంగ్‌ రూమ్‌కు బ్యాలెట్‌ యూనిట్లు తీసుకువస్తామన్నారు.

13న పెయిడ్‌ హాలిడే

పోలింగ్‌ నేపథ్యంలో ఈనెల 13న ఆర్జిత సెలవుగా ప్రకటించామని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఆ రోజు అందరూ ఓటు హక్కు వినియోగించునేందుకు వ్యాపార సంస్థలు తమ పరిధిలో ఉద్యోగులు, కార్మికులకు అనుమతి ఇవ్వాలన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌

ఎన్నికలు సజావుగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ నేతృత్వంలో సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో పనిచేసే కంట్రోల్‌ రూమ్‌లో 0891-2590100కు లేదా టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాలో పర్యటించడంతోపాటు అందుబాటులో ఉంటారన్నారు. ఆది, సోమవారాలు పత్రికల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు జిల్లా స్థాయిలోని ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. లేకపోతే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - May 12 , 2024 | 01:19 AM