పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం!
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:36 AM
సామాజిక పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వలంటీర్ల ద్వారా పింఛన్ల ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించి ఈనెల ఆరో తేదీలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

సచివాలయాల సిబ్బందితో అందజేత
నాలుగు కేటగిరీల లబ్ధిదారులకు ఇంటివద్దే పంపిణీ
నేటి మధ్యాహ్నం నుంచి ఆరో తేదీ వరకు ప్రక్రియ
ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు
(అనకాపల్లి, ఆంధ్రజ్యోతి)
సామాజిక పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వలంటీర్ల ద్వారా పింఛన్ల ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించి ఈనెల ఆరో తేదీలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతినెలా 2.65 లక్షల మందికి 14 రకాల పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.7.7 కోట్లు కేటాయిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించిన నేపథ్యంలో నాలుగు కేటగిరీలకు చెందిన పింఛన్‌దారులకు మాత్రమే ఇంటివద్దకు వెళ్లి గ్రామ సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన కేటగిరీలకు చెందిన వారంతా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 48,800 మందికి సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి పింఛన్ అందించనున్నారు. వీరిలో కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు 31 వేలమంది, తీవ్ర అనారోగ్య సమస్యలతో మంచాన ఉన్న వారు 1,800 మంది, వీల్‌చైర్స్ ఆధారంగా జీవిస్తున్నవారు రెండు వేల మంది, సైనిక్ వెల్ఫేర్ కింద వితంతువులు 14 వేల మంది ఉన్నారు. కాగా జిల్లాలోని 9,136 మంది వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం జిల్లాలో 522 వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో 650 మంది మాత్రమే సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి సచివాలయాలు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచాలని అధికారులు ఆదేశించారు. సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకొనే లబ్ధిదారులు ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అందరికీ పింఛన్లు అందిస్తాం
సామాజిక పింఛన్‌లు అందరికీ అందించేలా ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ పీడీ శశీదేవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి బ్యాంకులో నగదు జమవుతుందని, జిల్లాలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సిబ్బంది ద్వారా ఈనెల ఆరో తేదీ వరకు పింఛన్‌లు అందిస్తామని స్పష్టం చేశారు.