Share News

ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం పక్కాగా అందాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:44 AM

జిల్లాలోని ప్రతి వరద బాధితుడుకి ప్రభుత్వ సాయం పక్కాగా అందాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి వరద బాధితుడుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేలు ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కూనవరం మండలం పెర్కూరు గ్రామాన్ని మంగళవారం సందర్శించి, బాధితులతో స్వయంగా మాట్లాడారు.

ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం పక్కాగా అందాలి
కూనవరం మండలం పెర్కూరు గ్రామంలో వరద సాయంపై ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

ఆగస్టు ఒకటినే పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని స్పష్టీకరణ

పాడేరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రతి వరద బాధితుడుకి ప్రభుత్వ సాయం పక్కాగా అందాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి వరద బాధితుడుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేలు ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కూనవరం మండలం పెర్కూరు గ్రామాన్ని మంగళవారం సందర్శించి, బాధితులతో స్వయంగా మాట్లాడారు. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేలు ఆర్థిక సాయంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం కచ్చితంగా అందించాలన్నారు. చిన్నార్‌కూరులో విద్యుత్‌ సమస్య, చిన్నార్‌కూరు నుంచి బొదుకూరు వరకు రోడ్డు నిర్మాణంపై స్థానికులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీని అందించాలని పెర్కూరు వాసులు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య, ఏఎస్‌పీ రాహుల్‌ మీనా, అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సాయంపై కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌

జిల్లాలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం, బియ్యం పంపిణీపై జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ మంగళవారం రాత్రి రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ సాయం పంపిణీలో ఎటువంటి అపోహలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పొరపాట్లు జరిగితే అందుకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని, అందుకు సంబఽంధించి వైద్యారోగ్య శాఖ, సిబ్బంది అప్రమత్తం కావాలన్నారు.

ఆగస్టు ఒకటినే పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలి

జిల్లాలో ఆగస్టు ఒకతే తేదీ నాడే సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై జిల్లాలోని అధికారులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. తొలి రోజు శత శాతం పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా డీఆర్‌డీఏ అధికారులు, ఎంపీడీవోలు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఒకటీ అర పెన్షన్లు తొలి రోజు మిగిలితే రెండో రోజు ఉదయం వాటిని విధిగా లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు.

Updated Date - Jul 31 , 2024 | 12:44 AM