ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:36 AM
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
అనకాపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని పలువురు పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక జిల్లా ఇండస్ట్రీయల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నూతన పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాల కల్పన, నిబంధనల క్రమబద్ధీకరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పారిశ్రామిక విధానం 2024-29, ఎంఎస్‌ఈఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాలసీ-2024-29 రూపకల్పన ప్రక్రియ చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో అందుబాటులో వున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి పరిశ్రమలను స్థాపిస్తే ఉపయోగకరంగా ఉంటుందో జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీయల్ యూనియన్లు, అసోసియేషన్ ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో బి.దయానిధి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి జీఎం శ్రీధర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ హరిప్రసాద్ వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.