Share News

విద్యుత్‌ చార్జీలు పెంచబోం

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:22 AM

విద్యుత్‌ వినియోగదారులపై ఈ (2024-25) ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారం మోపడం లేదని, చార్జీలు పెంచడం లేదని ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ వెల్లడించారు.

విద్యుత్‌ చార్జీలు పెంచబోం

ఈ ఆర్థిక సంవత్సరం భారం మోపబోం

ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌

2024-25 ఆదాయ అంచనాలు రూ.21,162 కోట్లు

ప్రతిపాదిత ధరల రాబడి రూ.100.44 కోట్లు

ఒక్క రైల్వే ట్రాక్షన్‌ చార్జీలు యూనిట్‌కు రూపాయి పెంపునకు ప్రతిపాదన

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

విద్యుత్‌ వినియోగదారులపై ఈ (2024-25) ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారం మోపడం లేదని, చార్జీలు పెంచడం లేదని ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ వెల్లడించారు. విశాఖపట్నం కార్పొరేట్‌ కార్యాలయంలో ఏపీఈఆర్‌సీ సోమవారం నిర్వహించిన టారిఫ్‌ ప్రతిపాదనల స్వీకరణ, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని డిస్కమ్‌ ప్రగతిని, ప్రతిపాదనలు వివరించారు.

కేవలం రైల్వే ట్రాక్షన్‌ చార్జీలను మాత్రం యూనిట్‌కు రూపాయి పెంచడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. నాలుగేళ్ల నుంచి యూనిట్‌కు రూ.5.50 మాత్రమే వసూలు చేస్తున్నామని, సర్వీసు ధర 40 శాతం పెరిగిందని, ఈ నేపథ్యంలో పెంపు అనివార్యమన్నారు. దీనివల్ల డిస్కమ్‌కు అదనంగా రూ.100.24 కోట్లు సమకూరుతుందన్నారు. అలాగే ఎలకి్ట్రక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను ఓల్టేజ్‌ సర్వీసు వ్యయంతో టారిఫ్‌కు లింకు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుత ధరల నుంచి రూ.17,854.16 కోట్ల ఆదాయం వస్తుందని, ప్రతిపాదిత ధరల ద్వారా రూ.100.44 కోట్లు, ప్రతిపాదిత పర్‌ కాస్ట్‌ రికవరీ నుంచి రూ.3,207.27 కోట్లు కలిపి మొత్తం రూ.21,161.86 కోట్లు వస్తుందని అంచనా వేసినట్టు వివరించారు. రాబడి లోటు ఏమీ లేదని స్పష్టంచేశారు.

కొనుగోలు ఖర్చు యూనిట్‌ రూ.4.69

రాబోయే ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు విద్యుత్‌ కొనుగోలు ఖర్చు రూ.4.69గా ఉంటుందని, ప్రసారం, పంపిణీ నష్టాల వ్యయం 49 పైసలు, నెట్‌ వర్క్‌ ఖర్చులు రూ.1.63, ఇతర ఖర్చులు 28 పైసలు కలిపి సర్వీసు వ్యయం యూనిట్‌కు రూ.7.09 అవుతుందని వివరించారు. సగటున యూనిట్‌కి రూ.6.01 వస్తుందని, రెండింటి మధ్య తేడా యూనిట్‌కి రూ.1.08 ఉంటుందని అంచనా వేశారు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగం 7,741.84 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని, దాని ద్వారా రూ.3,764.76 కోట్లు వస్తుందని అంచనా వేశారు. వాణిజ్యానికి 1,501.26 మి.యూ. ఇవ్వడం ద్వారా రూ.1,534.45 కోట్లు వస్తుందని, పరిశ్రమలకు 494.59 మి.యూ. ఇవ్వడం వల్ల రూ.406.87 కోట్లు వస్తుందని, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు 4,767.55 మి.యూ. ఇస్తే రూ.1,000.71 కోట్లు వస్తాయని, సంస్థాగతంగా 508.32 మి.యూ.కు రూ.384.32 కోట్లు రావచ్చునని మొత్తం చూసుకుంటే ఎల్‌టీ విభాగంలో 15,013.56 మి.యూ.కు రూ.7,091.11 కోట్లు వస్తాయని అంచనాలు చూపించారు. అదే హెచ్‌టీ విభాగంలో అయితే 14,840.50 మి.యూ.కు రూ.10,673.34 కోట్లు వస్తుందని వివరించారు.

Updated Date - Jan 30 , 2024 | 01:22 AM