Share News

ఎన్నికల యంత్రాంగం అప్రమత్తం

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:04 AM

సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ శనివారం విడుదల అవుతుందన్న సమాచారంతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం సమీపంలో ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎంలు) భద్రపరిచిన గోదామును ఈ ఇద్దరు అధికారులు శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఎన్నికల యంత్రాంగం  అప్రమత్తం
జిల్లా పోలీస్‌ కార్యాలయం సమీపంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ

ఈవీఎంలు భద్రపరిచిన గోదామును పరిశీలించిన కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ

సబ్బవరం మండలంలో హైవేపై చెకపోస్టును తనిఖీ చేసిన ఎస్పీ

రోలుగుంట, ‘పేట మండలాల్లో సాయుధ బలగాలు కవాతు

అనకాపల్లి రూరల్‌/ సబ్బవరం/ నాతవరం/ రోలుగుంట, మార్చి 15: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ శనివారం విడుదల అవుతుందన్న సమాచారంతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం సమీపంలో ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎంలు) భద్రపరిచిన గోదామును ఈ ఇద్దరు అధికారులు శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎస్పీ కేవీ మురళీకృష్ణ సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు నర్సీపట్నం-తుని రోడ్డులో నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కేంద్ర సాయుధ బలగాలు (సీఐఎస్‌ఎఫ్‌) శుక్రవారం రోలుగుంట, పాయకరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కవాతు నిర్వహించారు.

గోదాములో ఈవీఎంల పరిశీలన

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) చాలా రోజుల క్రితమే జిల్లాకు చేరాయి. వీటిని అనకాపల్లి మండలం శంకరం పరిధి జిల్లా పోలీస్‌ కార్యాలయం సమీపంలో గోదాములో భద్రపరిచారు. వీటిని శుక్రవారం కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోదాముకు వేసిన సీల్‌, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఈవీఎంల గోదాము పక్కన ఉన్న ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన భవనం మొదటి, రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేయనున్న స్ర్టాంగ్‌ రూమ్స్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. వీరి వెంట ఏఎస్పీ విజయభాస్కర్‌, డీఆర్‌వో దయానిధి, ఆర్డీవో చిన్నికృష్ణ, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ రామ్మూర్తి, తదితరులు వున్నారు.

చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ

సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శుక్రవారం జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌, సిబ్బంది ఉన్నారు. కాగా ఎన్నికల నేపఽథ్యంలో మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 350 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు సీఐ పిన్నింటి రమణ తెలిపారు. అనుమానితులు, రౌడీలుగా గుర్తించిన 65 మందితోపాటు టీడీపీకి చెందిన 100 మంది, వైసీపీకి చెందిన 100 మంది, జనసేనకు చెందిన 35 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టామని చెప్పారు.

తుని-నర్సీపట్నం రోడ్డులో వాహనాలు తనిఖీ

నాతవరం పోలీసులు తుని-నర్సీపట్నం రోడ్డులో గన్నవరంమెట్ట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనం నంబరును డైరీలో నమోదు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్ల కూడదని, ఒకవేళ అధిక మొత్తంలో డబ్బు తీసుకెళుతూ పట్టుబడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరైన ఆధారాలు ఉంటే నగదును తిరిగి ఇచ్చేస్తామని, లేకపోతే నగదును సీజ్‌ చేసి ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని ఏఎస్‌ఐ బంగార్రాజు తెలిపారు.

రోలుగుంట, ‘పేట మండలాల్లో సాయుధ బలగాలు కవాతు

రోలుగుంట, పాయకరావుపేట మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలు (సీఐఎస్‌ఎఫ్‌) కవాతు నిర్వహించాయి. రోలుగుంట మండలం రోలుగుంట, శరభవరం, బుచ్చెంపేట, కుసర్లపూడి గ్రామాల్లో సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ సురేశ్‌ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి, ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని కోరారు. పాయకరావుపేట మండలంలో గుంటపల్లి, మంగవరం, గోపాలపట్నం, పెంటకోట, సత్యవరం, శ్రీరాంపురం, పెదరాంభద్రపురం, మాసాహెబ్‌పేట గ్రామాల్లో సీఐ పి.అప్పలరాజు ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని, కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 16 , 2024 | 01:04 AM