జోరుగా బెట్టింగ్
ABN , Publish Date - May 17 , 2024 | 01:02 AM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఫలితాలపై అందరి దృష్టి
మరికొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీలపైనే...
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై అక్కడకక్కడా పందాలు
కూటమి వైపు అత్యధికులు మొగ్గు
ప్రస్తుతం 2ః1 రేషియోలో జరుగుతున్న పందాలు
విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపుపై
బెట్టింగ్‌కు ఎవరూ ముందుకు రాని పరిస్థితి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. వచ్చే నెల నాలుగో తేదీన అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానున్నది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరోవైపు గెలుపోటములపై బెట్టింగ్ జోరందుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మెజారిటీలపై బెట్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారనే దానిపై కూడా అక్కడక్కడా పందేలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ఎక్కువ మంది పందాలకు ఎగబడుతుండడంతో 2ః1 నిష్పత్తిలో బెట్టింగ్ జరుగుతోంది.
ఈనెల 13న పోలింగ్ ముగిసింది. వచ్చే నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది. పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారు తమకు తోచింది చెబుతున్నారు. తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో విజయం ఏకపక్షమేనని ప్రచారం జరుగుతుండగా, మరికొన్ని నియోజక వర్గాలపై మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. విశాఖ ఉత్తరం, పశ్చిమ, మాడుగుల, పెందుర్తి వంటి నియోజక వర్గాలపై ఎక్కువ పందాలు సాగుతున్నాయి. భీమిలి, గాజువాక, విశాఖ ‘సౌత్’ వంటి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీపై బెట్టింగ్ కడుతున్నారు. ఈ అంశాల్లో రెండు వర్గాలు సమాన మొత్తంలో బెట్టింగ్ కడుతుంటే, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మాత్రం 2ః1 నిష్పత్తిలో బెట్టింగ్ జరుగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో బెట్టింగ్ కట్టేందుకు రెండో వైపు నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కూటమి అధికారం దక్కించుకుంటుందని భావిస్తున్నవారు రెండొంతులు తమ వాటాగా, ఒక వాటా వైసీపీ వైపు బెట్టింగ్ కాసేవారిని పెట్టుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వస్తుందనేవారు రెండు వాటాలు, వైసీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వారంతా ఒక వాటా....అంటే 2ః1 రేషియోలో పందాలు సాగుతున్నాయి. వైసీపీకి వచ్చే ఎంపీ స్థానాలపై కూడా పందాలు సాగుతున్నాయి. ఏడుకు మించి రావని పలువురు బెట్టింగ్ కాస్తున్నారు. ఇది వచ్చే నెల నాలుగో తేదీ నాటికి మరింత తారస్థాయికి చేరే అవకాశం ఉందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపుపై ఎవరూ బెట్టింగ్ కాసేందుకు రావడం లేదని అంటున్నారు.