ఈడీ అలజడి
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:30 AM
వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు.
మాజీ ఎంపీ ఎంవీవీ, జీవీ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు
ఏకకాలంలో ఐదుచోట్ల...
రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగింపు
వైసీపీ నేతల్లో గుబులు
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇల్లు, కార్యాలయంతోపాటు రుషికొండలోని ఆయన కుమారుడు ఉంటున్న ఇల్లు, సీతమ్మధారలోని జీవీ నివాసం, పెదవాల్తేరులోని అతని కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఇవి రాత్రి పది గంటలకూ కూడా కొనసాగుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంవీవీ, జీవీ బలవంతంగా తన వద్ద భూములు లాక్కొన్నారని, ఆ భూమి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే హయగ్రీవ సంస్థ ప్రమోటర్ అయిన చెరుకూరి జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు నగరంలో ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా వైసీపీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ, జీవీల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరపడం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో కొంతమంది నేతలు ఉమ్మడి జిల్లాలో భారీగా అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉందని, ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చుననే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా ఈడీ అధికారులు రెండు రోజుల కిందటే నగరానికి చేరుకున్నట్టు సమాచారం. శుక్రవారం ఎంవీవీ ఇల్లు, కార్యాలయం, రుషికొండలోని అతని కుమారుడు నివాసం ఉంటున్న ఇల్లుతోపాటు జీవీకి చెందిన ఇల్లు, కార్యాలయాల వద్ద అధికారులు రెక్కీ నిర్వహించినట్టు కొంతమంది చెబుతున్నారు. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించాలనే దానిపై పక్కాసమాచారం సేకరించిన తర్వాతే అధికారులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఏకకాలంలో ఐదుచోట్ల సోదాలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. ఈడీ అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. ఎంవీవీ సమక్షంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు చెబుతున్నారు. సోదాల్లో అధికారులకు ఏఏ పత్రాలు లభ్యమయ్యాయి, మనీలాండరింగ్ జరిగినట్టు నిర్ధారించేందుకు కావాల్సిన ఆధారాలేమైనా దొరికాయా?...అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.