Share News

కృష్ణాపురం పైన్‌ తోటల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:23 AM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలోని కృష్ణాపురం పైన్‌ తోటల్లో అటవీశాఖ అధికారులు ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.25 లక్షల తొలి దశ నిధులతో పనులు చేపడుతున్నారు.

కృష్ణాపురం పైన్‌ తోటల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు
కృష్ణాపురం పైన్‌ తోటల వద్ద ఎకో టూరిజం ప్రధాన ద్వారం పనులు

- రూ.25 లక్షలతో అటవీశాఖ పనులు

- అందుబాటులోకి రానున్న టెంట్లు, రెస్టారెంట్‌

చింతపల్లి, జనవరి 13:

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలోని కృష్ణాపురం పైన్‌ తోటల్లో అటవీశాఖ అధికారులు ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.25 లక్షల తొలి దశ నిధులతో పనులు చేపడుతున్నారు.

కృష్ణాపురం పైన్‌ తోటలు సాధారణంగానే పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు తోటల వద్ద ఫొటోలు తీసుకుని కొంత సమయం విశ్రాంతి తీసుకుని వెళుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ ఉన్నతాధికారులు కృష్ణాపురం పైన్‌ తోటల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. కృష్ణాపురం పైన్‌ తోటలు లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో, చింతపల్లి, పాడేరు-లంబసింగి మార్గంలో రహదారికి ఆనుకుని వున్నాయి. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. దీంతో కృష్ణాపురం పైన్‌ తోటలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఎకో టూరిజం కోసం పైన్‌ తోటల్లో 15 ఎకరాలు కేటాయించారు.

అందుబాటులోకి రానున్న సదుపాయాలు

కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టులో ప్రాథమికంగా పర్యాటకులకు అవసరమైన కనీస సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అంతర్గత రహదారులు, ఆర్చ్‌ను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, రెస్టారెంట్‌, రన్నింగ్‌ వాటర్‌, కాఫీ హౌస్‌ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. మరో పదిహేను రోజుల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఎకో టూరిజం ప్రాజెక్టు వద్ద తొలి విడతగా పర్యాటకులు బస చేసేందుకు 15 సింగల్‌, 10 డబుల్‌ టెంట్లు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ట్రీహట్స్‌, వ్యూపాయింట్‌, శాశ్వత గదులు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఏడాది పొడవునా సందర్శనకు అనువుగా..

ఎకో టూరిజం ప్రాజెక్టును పర్యాటకులు ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. సందర్శకుల వినోదం కోసం పలు రకాల క్రీడలు, ట్రెక్కింగ్‌ పాత్‌లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు వన భోజనాలు చేసేందుకు అనువుగా కొంత విస్తీర్ణం కేటాయించారు. ఈ ప్రాంతంలో పూల మొక్కలు, క్రోటాన్స్‌తో అలంకరించనున్నారు. ఓపెన్‌గా విందు, వినోద కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేందుకు అనువుగా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకో టూరిజంలో విశాలమైన పార్కింగ్‌తో పాటు పర్యాటకుల భద్రత కోసం 24 గంటలు టాస్క్‌ఫోర్సు ఉద్యోగులు విధుల్లో ఉంటారు.

Updated Date - Jan 14 , 2024 | 01:23 AM