Share News

జల్‌ జీవన్‌ పనులకు గ్రహణం

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:03 AM

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులు అటకెక్కాయి. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పనులు పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జల్‌ జీవన్‌ పనులకు గ్రహణం
అనకాపల్లి మండలం కోడూరులో మధ్యలో ఆగిన జల్‌ జీవన్‌ పనుల కోసం చేపట్టిన పనులు

కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించని గత వైసీపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా చెల్లింపుల్లో జాప్యం

ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు

దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులు అటకెక్కాయి. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పనులు పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని 2011లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండగా ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక గ్రామీణ నీటి సరఫరాల శాఖ ఇంజనీర్ల ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు నుంచి రూ.40 లక్షలు వరకు మంజూరు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ పథకం అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా కాంట్రాక్టర్లు చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేసింది. దీంతో కాంట్రాక్టర్లు తదుపరి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. దీని వల్ల జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగాయి. జిల్లాలో. 4.17 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 2.63 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇంకా 1.54 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి.

ఎన్నికల ముందు నిలిచిన పనులు

సార్వత్రిక ఎన్నికల ముందు జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద మొత్తం రూ.72 కోట్ల అంచనా వ్యయంతో దశలు వారీగా 2,163 నిర్మాణ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. వీటిలో 1,737 నిర్మాణ పనులు ప్రారంభించారు. 959 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 105 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.

కూటమి ప్రభుత్వంపై ఆశలు

ఈ పథకం పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనుల వివరాలపై జిల్లాల వారీగా నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా గ్రామీణ నీటి సరఫరాల శాఖాధికారులు ఈ పనులపై సమగ్ర నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మంజూరైన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా చేపట్టారు, గత ప్రభుత్వ గణాంకాల ప్రకారం పనులు జరిగాయా?, నిధులు పక్కదారి పట్టాయా? అనే కోణంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరాల శాఖాధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవు తున్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా కాకుండా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కొన్ని గ్రామాలను కలిపి ఒక యూనిట్‌గా తీసుకొని వాటర్‌ గ్రిడ్‌లుగా జల్‌ జీవన్‌ మిషన్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 20 , 2024 | 01:03 AM