రోలుగుంట పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:19 AM
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యుల్లో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం వుండడంలేదు. రాత్రిపూట విధుల్లో వుండే సిబ్బంది సైతం తాళాలువేసి పడుకుంటున్నారు. రోగులు ఎవరైనా అత్యవసర వైద్య సేవల కోసం వస్తే.. తాళాలు తీయడంలేదు. ఈ కారణంగానే శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు స్థానికంగా నివాసం వుండి వుంటే ఆమె బతికేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పీహెచ్‌సీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుమారుడు వైదాసు గణేశ్, బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపణ
శ్వాస సమస్యతో రాత్రి 11.30 గంటలకు మహిళను ఆస్పత్రికి తీసుకువచ్చిన కుమారుడు
మూసిఉన్న తలుపులు, లోపల నిద్రపోతున్న సిబ్బంది
అర్ధగంట తరువాత తీరిగ్గా తలుపులు తీసి.. డాక్టర్లు లేరని సమాధానం
రోగిని నర్సీపట్నం తీసుకెళ్లాలని సలహా
ఏరియా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
అప్పటికే మృతిచెందిన మహిళ
పేరుకే 24/7 వైద్య సేవలు
ఇద్దరు వైద్యుల్లో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండని వైనం
నర్సీపట్నం నుంచి రాకపోకలు
రోలుగుంట, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యుల్లో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం వుండడంలేదు. రాత్రిపూట విధుల్లో వుండే సిబ్బంది సైతం తాళాలువేసి పడుకుంటున్నారు. రోగులు ఎవరైనా అత్యవసర వైద్య సేవల కోసం వస్తే.. తాళాలు తీయడంలేదు. ఈ కారణంగానే శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు స్థానికంగా నివాసం వుండి వుంటే ఆమె బతికేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పీహెచ్‌సీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుమారుడు వైదాసు గణేశ్, బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
రోలుగుంట గ్రామానికి చెందిన వైదాసు లక్ష్మి(59) శనివారం రాత్రి శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుమారుడు గణేశ్, బంఽధవులు పొలుమూరి శ్రీను, తంగేటి ఆచారి, తంగేటి మణి, తదితరులు రాత్రి 11.30 గంటల సమయంలో వాహనంలో ఎక్కించుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆస్పత్రి తలుపులు మూసేసి, లోపల తాళం వేసివుంది. సిబ్బంది నిద్రపోతున్నారు. దీంతో వారు దాదాపు అరగంట సేపు తలుపులు కొట్టారు. ఎట్టకేలకు సిబ్బంది తలుపులు తీసి, డాక్టర్లు ఎవరూ లేరని, రోగిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులిద్దరూ స్థానికంగా నివాసం వుండడం లేదు. సుమారు పది కిలోమీటర్ల దూరంలోని నర్సీపట్నంలో వుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. వైద్యులకు ఫోన్ చేసి, వాళ్లు వచ్చే సరికి చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో లక్ష్మిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి, అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. రోలుగుంట పీహెచ్‌సీలో రాత్రి విధుల్లో వున్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రాథమిక వైద్యం అందించినా, ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు స్థానికంగా నివాసం వున్నా.. తన తల్లి ప్రాణాలు నిలిచేవని కుమారుడు గణేశ్ ఆవేదనతో చెప్పారు. తన తల్లి మృతికి కారణమైన వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
కాగా మృతురాలు లక్ష్మి కుటుంబ సభ్యుల ఆరోపణలపై వైద్యాధికారిణి ధనలక్ష్మికి ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్ చేసి వివరణ కోరగా, శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి, రోగి పల్స్ చెక్ చేశారని, పల్స్ పడిపోవడంతోనే మెరుగైన చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారని చెప్పారు. ఈ సంఘటనపై సోమవారం ఉదయం విధులకు వచ్చిన తరువాత శనివారం రాత్రి విధుల్లో వున్న సిబ్బందికి మెమోలు ఇచ్చి విచారణ చేపడతానని తెలిపారు.
పేరుకే 24 గంటల ఆస్పత్రి!
రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులతోపాటు సిబ్బంది. ఉన్నారు. ఇక్కడ 24 గంటలూ వైద్య సేవలు అందించాలి. కానీ రాత్రిపూట వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు డాక్టర్లలో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం వుండకుండా నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల లోపు, సాయంత్రం నాలుగు గంటల తరువాత ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో వుండడంలేదు. రాత్రిపూట విధుల్లో వుండే సిబ్బంది కూడా మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారు.