Share News

జగనాసురుడిని రాష్ట్రం నుంచి తరిమికొట్టండి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:45 AM

ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులను పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పిలుపునిచ్చారు.

జగనాసురుడిని రాష్ట్రం నుంచి తరిమికొట్టండి
బండారును సన్మానిస్తున్న సీఎం రమేశ్‌, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు

ఆత్మీయ సమావేశంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

పరవాడ, ఏప్రిల్‌ 18 : ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులను పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పిలుపునిచ్చారు. వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి బండారు నివాసం వద్ద గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జగన్‌ అనుకూల మీడియా తప్ప మిగతా మీడియా సంస్థలు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెబుతున్నాయన్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న 25ఎంపీ అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఐదేళ్లలో వైసీపీ నాయకులు ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్‌ ద్వారా సంపాదించిన సొమ్ము అంతా కక్కిస్తామన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో జనసేనకు ఎంత మెజార్టీ ఇస్తున్నారో ఎంపీగా సీఎం రమేశ్‌కు కూడా సమాన మెజార్టీ ఇవ్వాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించిన వారు ఇప్పుడు జనసేనలోకి రావాలని చూస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని ఆయన కోరారు. ఎన్టీపీసీలో అక్రమాలు జరుగుతున్నాయని, వైసీపీ నాయకులు బ్రోకర్లుగా తయారై ఒక్కొక్కరి నుంచి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి మెయింటెనెన్స్‌ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారన్నారు. పంచకర్ల రమేశ్‌బాబు విజయానికి టీడీపీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను మాడుగుల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెందుర్తి జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ బండారు సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తానన్నారు. బండారు తనకు గురువుతో సమానమన్నారు. ఐదేళ్లపాటు టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీ నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనలోకి చేర్చుకోబోమని ఆయన హామీ ఇచ్చారు. బండారు, సీఎం రమేశ్‌తో పాటు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సీఎం రమేశ్‌ను బండారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, పెందుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:45 AM