తాగునీటి వనరులకు పూర్వ వైభవం తేవాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:24 AM
జిల్లాలోని సహజ తాగునీటి వనరుల సంరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, పటిష్ట చర్యలు చేపట్టాలని, వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులను ఆదేశించారు.
సంరక్షణకు పటిష్ట చర్యలు, సరిహద్దు గుర్తింపునకు రీ సర్వే చేయాలి
సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని సహజ తాగునీటి వనరుల సంరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, పటిష్ట చర్యలు చేపట్టాలని, వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుడా ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని తాగునీటి వనరుల సంరక్షణ, ఇతర అంశాలపై కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో వీఎంఆర్‌డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్‌తో కలిసి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జల వనరుల పునరుద్ధరణ, సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సహజ సిద్ధ తాగునీటి వనరులను, మూలకేంద్రాలను, సరిహద్దులను గుర్తిస్తూ రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సంయుక్తంగా రీసర్వే చేయాలని ఆదేశించారు. సెప్టెంబరు 30లోగా సర్వే నివేదిక సమర్పించాలన్నారు. చిన్న నదులు, ధారలను గుర్తించాలని సూచించారు. భవిష్యత్లులో తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని, వనరులను కాపాడుకునేందుకు బాధ్యాయుతంగా కృషి చేయాలని పేర్కొన్నారు. పూడికలు తీయించాలని, కాలువలను శుభ్రం చేయించాలని, స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ సంరక్షించాలన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 179 తాగునీటి వనరుల కేంద్రాలున్నట్టు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయని, రీసర్వేలో మరిన్ని వెలుగులోకి వస్తాయన్నారు. సమావేశంలో ధన్ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లాలో తాగునీటి వనరులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ వివిధ అంశాలపై మాట్లాడారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్‌కుమార్, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
79 పంచాయతీల్లో గ్రామ సభలు
గంభీరం సభకు గంటా, కలెక్టర్ హాజరు
రూ.10 కోట్ల పనులకు ఆమోదం
విశాఖపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. రూ.10 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు ఆమోదించారు. గంభీరంలో నిర్వహించిన గ్రామసభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిరప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభల ద్వారా గ్రామపాలన, సమష్టి నిర్ణయాలు, ప్రభుత్వం నుంచి అందే సాయం, పఽథకాలపై ప్రజలకు సభల ద్వారా తెలుస్తాయన్నారు. ప్రస్తుత ఏడాదిలో ఉపాధి పథకం ద్వారా చేపట్టనున్న పనులు, తరువాత నాలుగేళ్లలో చేపట్టే పనులు, స్వర్ణగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో మౌలికవసతులు, వ్యక్తిగత, కమ్యూనిటీ అవసరాల కోసం గ్రామసభలో చర్చించడం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామసభల ద్వారా 87 రకాల పనుల కోసం మనమే స్వయంగా నిర్ణయించుకునే అవకాశం వచ్చిందన్నారు. గంభీరం పంచాయతీలో ఐఐఎం, ఇతర పరిశ్రమలుండడం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదన్నారు. సభల ద్వారా గామ్రాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.