Share News

24 గంటల్లో డోర్‌ డెలివరీ

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:45 AM

లాజిస్టిక్స్‌ సేవల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ (పీటీడీ) అధికారులు భావిస్తున్నారు.

24 గంటల్లో డోర్‌ డెలివరీ

పార్శిల్ రవాణాపై ఆర్టీసీ కార్యాచరణ

ప్రస్తుతానికి 84 నగరాలకు పరిమితం

త్వరలో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో విస్తరణకు ఏర్పాట్లు

లాజిస్టిక్స్‌ ద్వారా ఆదాయం పెంపునకు అధికారుల యత్నాలు

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 28:

లాజిస్టిక్స్‌ సేవల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ (పీటీడీ) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికైనా 24 గంటల వ్యవధిలోనే పార్శిల్స్‌ను డోర్‌ డెలివరీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. పార్శిల్‌ బుక్‌ చేసినప్పటి నుంచి మరుసటిరోజు అదే సమయంలోగా గమ్యస్థానానికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో అమల్లోకి తేనున్నారు. లాజిస్టిక్స్‌ సేవలు ప్రారంభించిన తరువాత 2021 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ప్రధాన నగరాల్లో డోర్‌ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. లాజిస్టిక్స్‌ ప్రధాన కార్యాలయం, ఆథరైజ్డ్‌ ఏజెన్సీకి పది కిలోమీటర్ల పరిధిలోని వారికి నేరుగా పార్శిల్స్‌ అందిస్తున్నారు. తొలుత ప్రధాన నగరాలకు పరిమితం చేసిన ఈ సేవలను దశల వారీగా 84 పట్టణాలకు విస్తరించారు. వచ్చే నెల నుంచి మరో 40 సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నారు.

ప్రస్తుతం 50 కిలోలకు పరిమితం

ప్రస్తుతం 50 కిలోల వరకు బరువున్న పార్శిల్స్‌ను మాత్రమే పీటీడీ డోర్‌ డెలివరీ చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరి నుంచి దీనిని వంద కిలోల వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు సమకూర్చుకుంటోంది.

పార్శిల్‌ డోర్‌ డెలివరీ చార్జీలు

బరువు చార్జీ రూ.లలో

కిలో వరకు 18

కిలో నుంచి 6 కిలోల వరకు 30

6 నుంచి 10 కిలోల వరకు 36

10 నుంచి 25 కిలోల వరకు 48

25 నుంచి 50 కిలోల వరకు 59

డోర్‌ డెలివరీ చేస్తున్న పట్టణాలు

రాష్ట్రంలో కర్నూలు, అదోని, ఆళ్ళగడ్డ, ఆత్మకూరు, డోన్‌, నంద్యాల, ఎమ్మిగనూరు, అనంతపురం, ధర్మవరం, గుత్తి, గుంతకల్‌, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కడప, బద్వేల్‌, బమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, తిరుపతి, కుప్పం, పలమనేరు, పీలేరు, శ్రీకాళహస్తి, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, నెల్లూరు, కావలి, వెంకటగిరి, గుంటూరు, నరసారావుపేట, పిడుగురాళ్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, వినుకొండ, బాపట్ల, చిలకలూరిపేట, విజయవాడ, అవనిగడ్డ, గుడివాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, నూజివీడు, ఏలూరు, భీమవరం, జంగారెడ్డి, గూడెం, కొవ్వూరు, పాలకొల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు, తుని, అన్నవరం, సామర్లకోట, విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, పలాస, సాలూరు, నరసన్నపేట లాజిస్టిక్స్‌ కేంద్రాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్‌ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు.

పెరుగుతున్న ఆదాయం

గత ఆర్థిక సంవత్సరంలో రూ.77.01 కోట్లు ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.77.69 కోట్లు ఆదాయం వచ్చింది. 11 శాతం పెరిగినట్టు లెక్కలు తేల్చారు. డోర్‌ డెలివరీ విధానంతోనే ఆదాయంలో పెరుగుదల వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

హౌస్‌ షిఫ్టింగ్‌ చేస్తాం

విశాఖ నుంచి ఇతర ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు ఇల్లు మారాలనుకునేవారి గృహోపకరణాలు, ఫర్నిచర్‌ తదితర సామగ్రిని రవాణా చేస్తాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా, అలాగే ఏప్రాంతం నుంచి అయినా ఉత్తరాంధ్ర జిల్లాలకు షిఫ్టింగ్‌ చేస్తాం. ఒకరోజు ముందుగా తెలియజేస్తే తరలించాల్సిన సామగ్రిని భద్రంగా ప్యాకింగ్‌ చేయిస్తాం. ప్యాకేజీ, తరలించడానికి అయ్యే రుసుమును వారికి తెలియజేస్తాం. సామగ్రి బరువును అంచనా వేసి రుసుము నిర్ణయిస్తాం.

- బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌

(కమర్షియల్‌ అండ్‌ ఆపరేషన్స్‌), విజయనగరం జోన్‌

అవకాశాలను వినియోగించుకుంటున్నాం

లాజిస్టిక్స్‌ విభాగం నుంచి అధిక ఆదాయం పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాం. పార్శిల్స్‌ రవాణా, డోర్‌ డెలివరీ, హౌస్‌ షిఫ్టింగ్‌, కార్గో రవాణా సౌకర్యాలు అందిస్తాం. ప్రైవేటు రవాణా సంస్థల కంటే తక్కువ చార్జీతో నాణ్యమైన సేవలందిస్తాం. లాజిస్టిక్స్‌ ఆదాయంలో విజయనగరం జోన్‌ మంచి స్థానంలో ఉంది.

-సి.రవికుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, విజయనగరం జోన్‌

Updated Date - Jan 29 , 2024 | 12:45 AM