దసపల్లా భూములపై దృష్టి పెట్టేనా??
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:01 AM
దసపల్లా భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తుందా?, లేదా?...అనే విషయం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

రికార్డుల్లో పేర్లు చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు
మరోవైపు వాటర్ ట్యాంకులు మార్చాలని జీవీఎంసీకి ‘ఎష్యూర్ కంపెనీ’ దరఖాస్తు
100 అడుగుల రహదారి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో యత్నం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
దసపల్లా భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తుందా?, లేదా?...అనే విషయం నగరంలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ భూములను సాయిరెడ్డి అండ్ కో కోర్టు ఉత్తర్వులు చూపించి వైసీపీ ప్రభుత్వ హయాంలో హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. దసపల్లా భూములను కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన నగర ప్రముఖులతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (‘ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో) చేసుకొని, సాయిరెడ్డి బృందం చేజిక్కించుకుంది. వారి పేర్లను జీవీఎంసీలో ఉన్న టౌన్ సర్వే రికార్డుల్లో ఇన్ కార్పొరేట్ (హక్కుదారులుగా చేర్చేందుకు) చేసేందుకు కూడా అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. మొన్నటివరకు కమిషనర్‌గా పనిచేసిన సాయికాంత్ వర్మ ఆయా హక్కుదారుల పేర్లను రికార్డుల్లో చేర్చాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే రికార్డుల్లో ఆ భూములకు హక్కుదారులుగా రాణి సాహెబా వాద్వాన్ పేరు నమోదైంది. అంతేకాకుండా వారి వారసులు దసపల్లా భూముల్లో అవి తమ భూములని, కోర్టులో కేసులు వేశామని, ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదంటూ బోర్డులు పెట్టారు. తమకు హక్కుగా సక్రమించిందని చెప్పేందుకు ఆ భూముల కొనుగోలుదారుల వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడం, లింక్ డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా పేర్లను ఇన్‌కార్పొరేట్ చేయడానికి నిరాకరించారు. ఒకవేళ అలా కాదని ముందుకు వెళ్లదలుచుకుంటే పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని, అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుందని కమిషనర్‌కు అధికారులు సూచించారు. అదే జరిగితే...అనేక అభ్యంతరాలు వస్తాయని, అసలుకే మోసం వస్తుందని భావించి ఇన్‌కార్పొరేట్ చేయకుండా పక్కన పెట్టారు.
వాటర్ ట్యాంకులు మార్చాలని లేఖ
ప్రభుత్వ ఆదేశం మేరకు కలెక్టర్ ఆయా భూములను 22-ఏ నుంచి తప్పించగా వాటిలో గతంలో జీవీఎంసీ నిర్మించిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి. సుమారుగా 2,200 చ.గ. విస్తీర్ణంలో అవి ఉండడంతో వాటిని అక్కడి నుంచి మార్చాలని ఎష్యూర్ ఎస్టేట్స్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలకు నాలుగు నెలల ముందు జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసింది. సర్వే నంబర్ 1197లో 2,200 గజాల్లో వాటర్ ట్యాంకులు ఉన్నాయని, వాటిని మరో ప్రాంతానికి మార్చాలని, వాటికి అయ్యే వ్యయం తామే భరిస్తామని కోరింది. దీనికి కూడా జీవీఎంసీ అధికారులు లోపాయికారీగా సహకరించారు. మరోవైపు సర్క్యూట్ హౌస్ నుంచి పందిమెట్ట వరకు 30 అడుగుల రహదారి ఉండగా దానిని 100 అడుగులకు విస్తరించడానికి వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేశారు. రహదారి నిర్మాణానికి గత డిసెంబరులో జీవీఎంసీ పత్రిక ప్రకటన కూడా జారీచేసింది. ఎష్యూర్‌కు దఖలు పడిన భూముల్లో కాకుండా ఆ ప్రాంతంలో ఇతరుల భవనాలు దెబ్బతినేలా 100 అడుగుల రహదారి విస్తరణకు నిర్ణయించారు. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ట్యాంకులు మార్చడానికి, రహదారి నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినందున సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
ఎవరికీ హక్కులు కల్పించడం తగదు
పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్
టౌన్ సర్వే రికార్డుల్లో దసపల్లా భూముల కొనుగోలుదారుల పేర్లు నమోదు చేయడానికి వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేనందున అధికారులే తిరస్కరించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. పైగా ఆ భూములు తమవని రాణీ సాహెబా వాద్వాన్ వారసులు న్యాయ పోరాటం చేస్తున్నందున వాటిపై ఎవరికీ హక్కులు కల్పించడం తగదని శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం దసపల్లా భూములను తప్పకుండా కాపాడుతుందన్నారు.