Share News

సచివాలయాలకు సొంత గూడు ఎన్నడో?

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:16 AM

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గ్రామ సచివాలయాలకు మండలంలో సొంత గూడు లేకుండాపోయింది. మండలంలో 16 సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్దేశించగా ఒక్కటి మాత్రమే పూర్తయింది. మిగతావన్నీ అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

సచివాలయాలకు సొంత గూడు ఎన్నడో?
జామిగూడ సచివాలయ భవన నిర్మాణం కోసం తీసిన పునాది గోతులు

- మండలంలో 16 భవనాలు నిర్మించాలని నిర్ణయం

- ఇప్పటికి ఒక్కటి మాత్రమే అందుబాటులోకి..

- మిగతావన్నీ అసంపూర్తిగా దర్శనం

- వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు

- అద్దె భవనాల్లో కొనసాగుతున్న సచివాలయాలు

పెదబయలు, ఏప్రిల్‌ 17: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గ్రామ సచివాలయాలకు మండలంలో సొంత గూడు లేకుండాపోయింది. మండలంలో 16 సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్దేశించగా ఒక్కటి మాత్రమే పూర్తయింది. మిగతావన్నీ అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

మండలంలో 23 పంచాయతీలకు గాను 16 సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో సచివాలయ భవనాన్ని రూ.43 లక్షల 60 వేలతో నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 16 సచివాలయాలను రూ.69 కోట్ల 7 లక్షల 60 వేలతో నిర్మించాలని ప్రణాళిక వేసుకుంది. 2020 మార్చి నెలలో అధికారులు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే కరోనా సమయంలో, ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేశారు. బిల్లులు రాని కారణంగా గత ఏడాది ఆగస్టు నెలలో పనులను నిలిపివేశారు. అయితే పాత బిల్లులు గత నెలలో కాంట్రాక్టర్లకు విడుదలయ్యాయి. మిగతా పనులు చేస్తే బిల్లులు వస్తాయో? రావో అనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదు. ఈ 16 సచివాలయాల్లో కిముడుపల్లి సచివాలయ భవనం ఒక్కటే పూర్తయి ప్రారంభానికి నోచుకుంది. మిగతావన్నీ వివిధ స్థాయిల్లో పనులు నిలిచిపోయాయి. జామిగూడ, ఇంజరి గ్రామాల్లో భవన నిర్మాణానికి పునాది గోతులు తవ్వి వదిలేశారు. గిన్నేలకోట, కుంతుర్ల గ్రామాల్లో పిల్లర్ల స్థాయిలో పనులు నిలిచిపోయాయి. సీతగుంటలో ఇద్దరు కాంట్రాక్టర్లు మారినా గోడల నిర్మాణం పూర్తికాలేదు. అడుగులపుట్టు, రూడకోట, పర్రెడా, అరడకోట, గంపరాయి తదితర గ్రామాల్లో శ్లాబ్‌ స్థాయిలో పనులు నిలిచిపోయాయి. దీంతో 15 సచివాలయాలకు సొంత గూడు లేకుండాపోయింది. ఈ సచివాలయ భవన నిర్మాణాలు ఎప్పటి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 18 , 2024 | 01:16 AM