Share News

బూడికి ఇంటిపోరు!

ABN , Publish Date - May 08 , 2024 | 12:29 AM

వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు ఇంటి పోరు ఎక్కువగా ఉందా?.. సొంత నియోజకవర్గం మాడుగులలోనే అసమ్మతి తీవ్రంగా ఉందా?..సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుందా?..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయనకు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

బూడికి ఇంటిపోరు!
ఇటీవల అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్‌ నేత కిలపర్తి భాస్కరరావు, తదితరులు

- వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి

ఇంటా, బయటా అసమ్మతి

- మాడుగుల అసెంబ్లీ స్థానాన్ని కుమార్తెకు కేటాయించడంతో భగ్గుమన్న మొదటి భార్య కుమారుడు

- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి..

- పార్టీని వీడుతున్న సీనియర్‌ నాయకులు

- ముత్యాలనాయుడు వర్గీయులు డీలా

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు ఇంటి పోరు ఎక్కువగా ఉందా?.. సొంత నియోజకవర్గం మాడుగులలోనే అసమ్మతి తీవ్రంగా ఉందా?..సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుందా?..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయనకు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి బూడి ముత్యాలనాయుడు 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయాలనుకున్నారు. పార్టీ అధిష్ఠానం తొలుత టికెట్‌ కూడా ఖరారు చేసింది. అయితే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి తరపున సీఎం రమేశ్‌ (బీజేపీ) పోటీ చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్టు వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో అయిష్టంగానే బూడి ముత్యాలనాయుడు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మాడుగుల అసెంబ్లీ స్థానాన్ని తన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు ఇప్పించుకున్నారు. దీంతో సొంత పార్టీతో పాటు కుటుంబం నుంచి కూడా అసమ్మతి చెలరేగింది.

కుటుంబంలోనే వ్యతిరేకత

బూడి ముత్యాలునాయుడుకు ఇంటిపోరు పెద్ద తలనొప్పిగా మారింది. రెండో భార్య కుమార్తె అనురాధకు మాడుగుల అసెంబ్లీ స్థానం ఇవ్వడంతో మొదటి భార్య కుమారుడు రవికుమార్‌ భగ్గుమన్నారు. ఆయన మాడుగుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు బూడి మొదటి భార్య తమ్ముడు, వరుసకు బావమరిది అయిన గంగాధర్‌ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బూడి స్వగ్రామం తారువలో ప్రచారం చేస్తున్న గంగాధర్‌పై బూడి వర్గీయులు దాడి చేయడం, పరామర్శకు వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

జారుకుంటున్న వైసీపీ నేతలు

ఇంటిపోరును ఎదుర్కొంటున్న బూడి ముత్యాలనాయుడిని సొంత పార్టీలోనూ అసమ్మతి పోరు వెంటాడుతోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో వైసీపీ శ్రేణులు పార్టీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నాయి. తాజాగా బూడి సొంత నియోజకవర్గమైన మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలానికి చెందిన వైసీపీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, ఆమె భర్త, సీనియర్‌ వైసీపీ నాయకుడు కిలపర్తి భాస్కరరావు బూడికి షాకిచ్చారు. మారేపల్లి వైసీపీ సర్పంచ్‌ కన్నతల్లి, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవితో కలిసి వందలాది మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. దీంతో బూడి వర్గం డీలా పడిందని తెలిసింది.

Updated Date - May 08 , 2024 | 12:29 AM