Share News

పార్టీలకు అనుకూలంగా వ్యవహరించొద్దు

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:28 AM

సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ శాఖలోని అధికారులు, సిబ్బంది ఎవరైనా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినా, నాయకులతో సన్నిహితంగా మెలిగినా కఠిన చర్యలు తప్పవని సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ హెచ్చరించారు.

పార్టీలకు అనుకూలంగా వ్యవహరించొద్దు

నేతలకు సన్నిహితంగా మెలగవద్దు

ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు

పోలీసులకు సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ హెచ్చరిక

ఇంటింటి ప్రచారానికి పోలీసుల అనుమతి తప్పనిసరి

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ శాఖలోని అధికారులు, సిబ్బంది ఎవరైనా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినా, నాయకులతో సన్నిహితంగా మెలిగినా కఠిన చర్యలు తప్పవని సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ హెచ్చరించారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించాలనున్నాసరే కచ్చితంగా పోలీసుల అనుమతి పొందాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన పోలీస్‌, రెవెన్యూ ఉద్యోగులతో కూడిన 63 ప్రత్యేక బృందాలు నగరంలో తిరుగుతాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి సువిధ, సీ విజిల్‌ యాప్‌లతోపాటు డయల్‌ 100, డయల్‌ 112కి ఫిర్యాదు చేయాలన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నగర పరిధిలోని 635 మంది రౌడీషీటర్లు, 103 మంది డీసీలు, 40 మంది కేడీలు, 1,314 మంది సస్పెక్ట్‌ షీట్‌ కలిగివున్నవారితోపాటు సుమారు 3,200 మందిని బైండోవర్‌ చేశామన్నారు. నగరంలో 728 లైసెన్స్‌ గన్‌లు ఉండగా వాటన్నింటినీ స్టేషన్లలో డిపాజిట్‌ చేయించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించి, దానికి సంబంధించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. తప్పుడు ఫిర్యాదులతో పోలీసుల శ్రమ, సమయం, ప్రజాధనం దుర్వినియోగం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ పోలీసులు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీస్‌ అధికారులు, సిబ్బంది విధిగా తమ గుర్తింపు కార్డుతోపాటు ఎన్నికల డ్యూటీపాస్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ సీపీ ఫకీరప్ప, డీసీపీలు మణికంఠ చందోలు, ఎం.సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 01:28 AM