Share News

అడవిపై గొడ్డలి వేటు

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:49 AM

మండలంలోని బోడపాలెం, నీలిగుంట అటవీ ప్రాంతంలో యూకలిప్టస్‌ (నీలగిరి) ప్లాంటేషన్‌లో చెట్లు అక్రమార్కుల గొడ్డలి వేటకు గురవుతున్నాయి. నీలిగుంట గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, నీలగిరి చెట్లతను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వీటిని రాత్రి వేళ్లలో కలప డిపోలకు, పేపర్‌ మిల్లులకు తరలిస్తున్నారు.

అడవిపై గొడ్డలి వేటు
అటవీ ప్రాంతంలో యూకలిప్టస్‌ చెట్లు నరికివేయడంతో మిగిలిన మొదలు

పట్టాలమ్మగుడి కొండప్రాంతంలో యూకలిప్టస్‌ చెట్లు అక్రమంగా నరికివేత

ఇప్పటికే పది ఎకరాల్లో కనుమరుగైన చెట్లు

పేపరు మిల్లులకు రవాణా చేస్తున్న అక్రమార్కులు

అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపణ

కోటవురట్ల, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోడపాలెం, నీలిగుంట అటవీ ప్రాంతంలో యూకలిప్టస్‌ (నీలగిరి) ప్లాంటేషన్‌లో చెట్లు అక్రమార్కుల గొడ్డలి వేటకు గురవుతున్నాయి. నీలిగుంట గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, నీలగిరి చెట్లతను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వీటిని రాత్రి వేళ్లలో కలప డిపోలకు, పేపర్‌ మిల్లులకు తరలిస్తున్నారు.

బోడపాలెం, నీలిగుంట మధ్య పట్టాలమ్మ గుడి కొండ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చాలా ఏళ్ల క్రితం వందిలాది ఎకరాల్లో యూకలిప్టస్‌ మొక్కలు నాటారు. కాలక్రమేణా ఇవి ఏపుగా పెరిగి, చెట్లుగా ఎదిగాయి. ఇక్కడ టేకు ప్లాంటేషన్‌ కూడా వుంది. ఈ నేపథ్యంలో మూడు నెలల నుంచి నీలగిరి ప్లాంటేషన్‌లో అక్రమంగా చెట్లు మాయం అవుతున్నాయి. నీలిగుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని రోజూ పగటిపూట చేట్లు నరికిస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లలోకి లోడింగ్‌ చేసి పేపరు మిల్లులకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. వీరు ఎప్పటి నుంచో యూకలిప్టస్‌ కలప వ్యాపారం చేస్తున్నారు. గతంలో జిరాయితీ, డి.పట్టా భూముల్లో యూకలిప్టస్‌ తోటలను కొనుగోలు చేసి, కలపను పేపర్‌ మిల్లులకు సరఫరా చేసేవారు. ఇప్పుడు వారి కన్ను అటవీ భూముల్లోని నీలగిరి తోటలపై పడింది. ఇప్పటి వరకు సుమారు పది ఎకరాల్లో నీలగిరి చెట్లను నరికివేసినట్టు తెలిసింది. ఈ విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి వచ్చినప్పుటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు. కలప అక్రమార్కుల నుంచి అటవీ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్ల్లు అందుతున్నాయని చెబుతున్నారు. కాగా అటవీ ప్రాంతంలో యూకలిప్టస్‌ చెట్లు నరికి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో సదరు వ్యక్తులు ఇటీవల పది ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. నీలగిరి చెట్లతోపాటు అప్పుడప్పుడు టేకు చెట్లను కూడా నరికివేసి, దుంగలను తరలించుకుపోతున్నట్టు తెలిసింది.

కాగా బోడపాలెం, నీలిగుంట అటవీ ప్రాంతంలో యూకలిప్టస్‌ చెట్లు అక్రమంగా నరికివేయడంపై నర్సీపట్నం డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించకపోతే మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా బోడపాలెం, నీలిగుంట అటవీ ప్రాంతంలో అక్రమంగా యూకలిప్టస్‌ చెట్ల నరికివేతపై ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అప్పారావును ‘ఆంధ్రజ్యోతి’ విరణ కోరగా.. ప్లాంటేషన్‌ను పరిశీలించన తర్వాత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 12:49 AM