పరిహారం చెక్కులు పంపిణీ
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:22 AM
అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 17 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల చొప్పున అందజేసినట్టు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం తెలిపారు.
17 మంది ఇళ్లకు వెళ్లి అందజేసిన రెవెన్యూ అధికారులు
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల, ఆగస్టు 23: అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 17 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల చొప్పున అందజేసినట్టు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాకు చెందిన వేగి సన్యాసినాయుడు భార్య వేగి అచ్చియ్యమ్మ, ఎల్లబిల్లి చిన్నారావు భార్య ఎల్లబిల్లి లోవమ్మకు, పూడి మోహన్ దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యుడు పూడి సూర్యారావుకు, జవ్వారి చిరంజీవి కుటుంబ సభ్యురాలు చెల్లా వీణాదేవి, పూసర్ల వెంకటసాయి కుటుంబ సభ్యురాలు పూసర్ల మహాలక్ష్మి, వెంకట నాగ అప్పలశెట్టి కుటుంబసభ్యులకు రాంబిల్లి డిప్యూటీ తహసీల్దార్ ఎం. గణపతిరావు వారి ఇళ్లకు తీసుకువెళ్లి చెక్కులను అందజేసినట్టు కలెక్టర్ చెప్పారు. విశాఖ జిల్లాకు చెందిన నీలాపు రామిరెడ్డి కుటుంబసభ్యురాలు దొండా సునీతాకు, బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు కుటుంబసభ్యురాలైన బొడ్డు కనక మహాలక్ష్మికు రోలుగుంట తహసీల్దార్ కె. వరహాలు చెక్కులను స్వయంగా అందించారన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మృతుడు ఒమ్మిడి ఆనందరావు కుటుంబసభ్యురాలైన సత్యవతికు, మహంతి నారాయణరావు కుటుంబసభ్యురాలైన మహంతి స్వాతికు చోడవరం డీటీ పి. సత్యనారాయణ చెక్కులను అందించారని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన హెచ్. ప్రశాంత్ కుటుంబ సభ్యురాలైన పునుమజ్జి జ్యోతికు, పైడి రాజశేఖర్ కుటుంబసభ్యుడు అయిన పైడి ధర్మారావుకు స్వయంగా కె.కోటపాడు డీటీ డి.రమేష్‌బాబు చెక్కులను అందజేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కె. గణేష్‌కుమార్ కుటుంబ సభ్యురాలైన పడుచూరి అరుణకుమారికు వి.మాడుగుల డీటీ ఎం.రాజా చెక్కును అందజేశారన్నారు. కాకినాడకు చెందిన చెల్లపల్లి హారిక కుటుంబ సభ్యురాలు చెల్లపల్లి అన్నపూర్ణకు, మొండి నాగబాబు కుటుంబ సభ్యురాలైన మొండి సాయి దుర్గాకు నర్సీపట్నం డీటీ వై. శ్యామ్‌కుమార్ స్వయంగా చెక్కులను అందించినట్టు చెప్పారు. భద్రాది కొత్తగూడెంకు చెందిన ఎం. సురేంద్ర కుటుంబసభ్యురాలు పరుచూరి దీపకు దేవరాపల్లి డీటీ జి. ఆనందరావు చెక్కును అందజేశారన్నారు. అలాగే బీఆర్ అంబేడ్కర్ జిల్లా అమలాపురానికి చెందిన మరిశెట్టి సతీష్ కుటుంబ సభ్యురాలు మరిశెట్టి సాయి శ్రీవినాయక దుర్గా రమాకు మునగపాక డీటీ టీహెచ్. వినయ్‌కుమార్ అందించారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జవ్వాది పార్థసారథి కుటుంబ సభ్యుడైన కోటేశ్వరరావుకు కశింకోట డీటీ కె. సురేష్‌నాయుడు వారి ఇంటికి తీసుకువెళ్లి చెక్కును అందించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.