Share News

వైసీపీలో అసంతృప్తి సెగలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:46 PM

రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం అరకులోయ అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ జి.మాధవికి ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో స్థానిక పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. స్థానికేతరాలైన మాధవి వద్దు.. స్థానికులే ముద్దు అని నినాదాలు చేస్తూ అరకులోయలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు పార్టీ స్థానిక నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు.

వైసీపీలో అసంతృప్తి సెగలు
డుంబ్రిగుడలో రాస్తారోకో చేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

ఎంపీ మాధవిని అరకు అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించడంపై ఆగ్రహం

పలు మండలాల్లో పార్టీ నాయకుల నిరసనలు

స్థానికుల్లో ఎవరికి టికెట్‌ కేటాయించినా గెలిపించుకుంటామని వెల్లడి

అధిష్ఠానం స్పందించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిక

అరకులోయ, జనవరి 3:

రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం అరకులోయ అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ జి.మాధవికి ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో స్థానిక పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. స్థానికేతరాలైన మాధవి వద్దు.. స్థానికులే ముద్దు అని నినాదాలు చేస్తూ అరకులోయలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు పార్టీ స్థానిక నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలులో కూడా ఆందోళనలు చేపట్టారు.

అరకులోయ నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు, ఆశావహులైన సమర్డి రఘునాథ్‌, హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం, హుకుంపేట మాజీ ఎంపీపీ బత్తిరి రవిప్రసాద్‌ మాట్లాడుతూ స్థానికేతరులకు టికెట్‌ కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్థానికుల్లో ఎవరికి టికెట్‌ కేటాయించినా తాము గెలిపించుకుంటా మన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరకు అసెంబ్లీ టికెట్‌పై పునరాలోచించి స్థానికుల్లో ఎవరికైనా టికెట్‌ కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, కోడ సింహాద్రి, నాయని సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరిలో...

మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైసీపీ మండల అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో పార్టీ మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు నిరసన చేపట్టారు. స్థానికేతరులకు అరకు అసెంబ్లీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో పలువురు ఆశావహులు, పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారు ఉన్నారని, అటువంటి స్థానిక నేతల్లో ఒక్కరిని ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. లేకుంటే తామంతా పనిచేసేందుకు సిద్ధంగా లేమన్నారు. స్థానికుల్లో ఏ సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చినా తామంతా పని చేస్తామని, ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి తీర్మానం పంపుతున్నట్టు పార్టీ మండల అధ్యక్షుడు రేగబోయిన స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శెట్టి లక్ష్మణరావు, కోనాపురం సర్పంచ్‌ గుబాయి అప్పలమ్మ, రఘునాథ్‌, డొంబు, చిలకలగెడ్డ ఎంపీటీసీ సభ్యురాలు తడబారికి మితుల, పెదబిడ్డ సర్పంచ్‌ సాలేపు పెంటమ్మ, బీంపోలు ఎంపీటీసీ సభ్యుడు సిరగం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపీ గొడ్డేటి మాధవిని పార్టీ అధిష్టానం నియమించడంపై వైసీపీ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వీరంతా డుంబ్రిగుడ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. స్థానికేతరులు వద్దు.. స్థానికులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాయకులను సమన్వయకర్తగా నియమించకుండా, వేరే నియోజకవర్గం నుంచి ఎంపీ మాధవిని సమన్వయకర్తగా నియమించడం సరికాదన్నారు. దీనిపై అధిష్ఠానం పునరాలోచించి సమన్వయకర్త మార్పుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మండలంలో వైసీపీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆనందరావు, సర్పంచులు వెంకటరావు, నాగేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సొర్రు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, నాయకులు సింహాచలం, కృష్ణారావు, గోపాల్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలోని వైసీపీ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంపై తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింహాచలం, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

పెదబయలులో..

పెదబయలు: మండల కేంద్రంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైసీపీ మండల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ మాధవిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ మాధవి ఏనాడూ స్థానిక నేతలను కలవలేదని, కనీసం అరకులో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. అధిష్ఠానం పునరాలోచించి స్థానికులకు టికెట్‌ కేటాయిస్తే అందరం సమష్టిగా గెలిపించుకుంటామన్నారు. అలా కాని పక్షంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కె.బొంజుబాబు, మాజీ ఎంపీపీలు గంపరాయి సూరయ్య, ఉమామహేశ్వరరావు, నాయకులు గంగభవాని, భీముడు, ఆనందరావు, సింహాచలం, సూర్యనారాయణ, కృష్ణారావు, అనిత, లక్ష్మి, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:46 PM