Share News

ధాన్యం కొనుగోలుపై వివాదం

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:20 AM

ధాన్యంలో తేమ శాతం అధికంగా వుందంటూ ప్రభుత్వ సిబ్బంది కొనుగోలు చేయడం లేదని మండలంలోని పలుగ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. కాగా నిర్ణీత ప్రమాణాలకన్నా ఎక్కువ శాతం తేమ వుంటే.. రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలుపై వివాదం
గొలుగొండలో నూర్పు అనంతరం ధాన్యాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉన్న రైతు

తేమ శాతం అధికంగా ఉందంటున్న ప్రభుత్వ సిబ్బంది

రెండు రోజులపాటు ఎండనిస్తే కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి వెల్లడి

కల్లాల్లోనే ఉంచితే తడిసిపోతుందని రైతులు ఆవేదన

తక్కువ రేటుకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి సంసిద్ధత

గొలుగొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యంలో తేమ శాతం అధికంగా వుందంటూ ప్రభుత్వ సిబ్బంది కొనుగోలు చేయడం లేదని మండలంలోని పలుగ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. కాగా నిర్ణీత ప్రమాణాలకన్నా ఎక్కువ శాతం తేమ వుంటే.. రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో దాదాపు రెండు వారాల నుంచి ఆకాశం మేఘావృతంగా వుంటున్నది. రెండు, మూడుసార్లు మోస్తరు వర్షాలు సైతం కురిశాయి. అప్పటికే వరి పంట పండడంతో వాతావరణం అనుకూలంగా వున్నప్పుడు రైతులు కోత కోసి, కుప్పలు వేసుకున్నారు. అయితే వరి పనులు పూర్తిగా ఎండకముందే కుప్పలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వరి పంటను త్వరగా నూర్చుకోకపోతే ధాన్యం ముక్కిపోయే అకాశం వుంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి వర్షాలు కురవకపోవడం, ఎండ కాస్తుండడంతో గొలుగొండ, పాతమల్లంపేట, అమ్మపేట, పప్పుశెట్టిపాలెం, పాకలపాడు, చోద్యం, కృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, విప్పలపాలెం, లింగపేట, చీడిగుమ్మల తదితర గ్రామాల్లో రైతులు వరి కుప్పల నూర్పు పనులు చేపట్టారు. ధాన్యం అమ్మకాల కోసం రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదిస్తున్నారు. వాళ్లు వచ్చి ధాన్యంలో శాతాన్ని పరీక్షించి, నిర్ణత ప్రమాణాలకన్నా ఎక్కువ తేమ (17 శాతానికి మించి) వుందంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. దీంతో నూర్చిన ధాన్యాన్ని కల్లాల్లోనే వుంచేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ ఎండ అంతగా లేకపోవడంతో త్వరగా ఆరే పరిస్థితి లేదని అంటున్నారు. వర్షం కురిస్తే తడిపోయే అవకాశం వుందని వాపోయారు. ప్రభుత్వ సిబ్బంది ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ రేటుకు అయినా అమ్ముకోక తప్పదని చెబుతున్నారు. కాగా ధాన్యం కొనుగోలు చేయని విషయాన్ని మండల వ్యసాయాధికారి సుధావాణి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, వర్షాల కారణంగా వరి పనలు పూర్తిగా ఎండకపోవడంతో ధాన్యంలో తేమ శాతం అధికంగా వుందని, కొద్ది రోజులు ఎండలో ఆరబెడితే తేమ శాతం తగ్గుతుందని అన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం కంటే ఎక్కువ వుంటే తీసుకోవడానికి రైస్‌ మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నూర్పు అనంతరం రెండు, మూడు రోజులపాటు ధాన్యాన్ని ఎండలో ఆరబెడితే కొనుగోళ్లు చేపడతామని చెప్పారు.

Updated Date - Dec 28 , 2024 | 12:20 AM