Share News

కోడ్‌ అమలులో వివక్ష!

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:44 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జిల్లాలో కొన్నిచోట్ల అమలు కావడంలేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ శనివారం సాయంత్రం విడుదల చేయగా, మరుక్షణం నుంచే కోడ్‌ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు తదితర వాటిని 24 గంటల్లోకి తొలగించాలని ఆదేశించింది. కానీ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రానికి కూడా వీటిని తీసేయలేదు. ముఖ్యంగా అధికార వైసీపీకి చెందిన ఫెక్సీల తొలగింపులో ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోడ్‌ అమలులో వివక్ష!
కోట్నివీధిలో తొలగించని వైసీపీ ఫ్లెక్సీ, దుకాణంపై హోర్డింగ్‌

వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల తొలగింపులో అధికారులు మీనమేషాలు

అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు

అనకాపల్లి టౌన్‌, మార్చి 17: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జిల్లాలో కొన్నిచోట్ల అమలు కావడంలేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ శనివారం సాయంత్రం విడుదల చేయగా, మరుక్షణం నుంచే కోడ్‌ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు తదితర వాటిని 24 గంటల్లోకి తొలగించాలని ఆదేశించింది. కానీ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రానికి కూడా వీటిని తీసేయలేదు. ముఖ్యంగా అధికార వైసీపీకి చెందిన ఫెక్సీల తొలగింపులో ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అనకాపల్లి నియోజకవర్గ ఎన్నికల రిట్నరింగ్‌ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన జాహ్నవి ఆదేశాల మేరకు అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు పనులు చేపట్టారు. కానీ వీధుల్లో ఇబ్బడి ముబ్బడిగా వున్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఆదివారం సాయంత్రానికి కూడా తొలగించలేదు. కోట్నివీధిలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మకు ఇటీవల వైసీపీ జెండా రంగులతోపాటు ఎన్నికల గుర్తు అయినా ఫ్యాన్‌ బొమ్మలు వేశారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ రెండు రోజుల క్రితం ఈపీడీసీఎల్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సున్నం వేయిస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మపై వేసిన రంగులుగానీ, అదే ప్రాంతంలో విద్యుత్‌ స్తంభాలకు వేసిన వైసీపీ జెండా రంగులుగానీ తొలగించకపోవడం గమనార్హం.

పరవాడ మండలంలో..

పరవాడ, మార్చి 17 : ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ మండల కేంద్రంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను ఆదివారం సాయంత్రం వరకు అధికారులు తొలగించలేదు. కోడ్‌ అమల్లోకి వచ్చిన 24 గంటల్లో (ఆదివారం సాయంత్రం మూడు గంటల కల్లా) ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగులు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, తదితర వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ ఆదేశాలను పరవాడలో అమలు చేయలేదు. బొంకులదిబ్బవీధి, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎదురుగా, మండల పరిషత్‌ జంక్షన్‌ వద్ద వైసీపీ, టీడీపీ ప్రచార హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. సంతబయలు వద్ద కొన్నింటిని మాత్రమే తొలగించారు.

Updated Date - Mar 18 , 2024 | 12:44 AM