Share News

విభిన్నం... విశాఖ ఫలితం

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:52 AM

గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్ల తీర్పు కాస్త భిన్నంగా ఉంటుంది.

విభిన్నం... విశాఖ ఫలితం

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు

విశాఖ ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమ, గాజువాక, భీమునిపట్నం, శృంగవరపుకోట

  • పార్టీతో పాటు అభ్యర్థి, ఇతర అంశాలకూ ప్రాధాన్యం

  • ఏ పార్టీకీ దక్కని అప్రతిహత విజయం

  • 1957 నుంచి ఇప్పటివరకూ 16సార్లు ఎన్నికలు

  • ఏడుసార్లు కాంగ్రెస్‌, మూడుసార్లు టీడీపీ విజయం

  • బీజేపీ, వైసీపీ ఒకొక్కసారి

  • ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ

గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్ల తీర్పు కాస్త భిన్నంగా ఉంటుంది. పార్టీలతో పాటు అభ్యర్థి, ఇతరత్రా అంశాలు కూడా ఫలితాలను నిర్దేశిస్తాయి. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల తీర్పును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. విశాఖ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌ కోట. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత రాజకీయ చిత్రం మారింది. 1957 నుంచి (1951లో ద్విసభ్యత్వ నియోజకవర్గంగా ఉండేది) ఇప్పటివరకూ మొత్తం పదహారుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా ఏడుసార్లు గెలుపొందగా, టీడీపీ మూడుసార్లు విజయం సాధించింది. బీజేపీ, వైసీపీ ఒక్కొక్కసారి గెలుపొందాయి.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో విశాఖపట్నం కీలకమైన ప్రాంతం. ఏపీకి ఆర్థిక రాజధానిగా గుర్తింపుపొందింది. ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైనవారికి చెప్పాలంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గత ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఇంకా కాంగ్రెస్‌ సహా పలు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరిగింది. ఇందులో వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి తరపున ఎం.శ్రీభరత్‌ పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ జరగనున్నది.

ఇదీ చరిత్ర

విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి లంకా సుందరం...కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుబ్బరాజుపై విజయం సాధించారు. 1957 ఎన్నికల్లో విజయనగరం రాజవంశానికి చెందిన పి.వి.జి.రాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎం.వి.కృష్ణారావుపై విజయం సాధించారు. 1962లో తొలిసారి ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. ఆ పార్టీ తరపున విజయనగరం రాజవంశానికి చెందిన విజయ్‌ ఆనంద్‌ (విజ్జీ) పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి మద్ది సి.రెడ్డిపై గెలిచారు. 1967లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథం...కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వెంకటరావును ఓడించారు. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మళ్లీ పి.వి.జి.రాజు పోటీ చేసి, ఇండిపెండెంట్‌ అభ్యర్థి తెన్నేటి విశ్వనాథాన్ని ఓడించారు. 1977 ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయినా రాష్ట్రంలో మాత్రం ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో విశాఖ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ...కొత్తగా ఏర్పడిన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథంపై దాదాపు 43 వేల ఓట్ల తేడాతో గెలిచారు. జనతా పార్టీలో చీలిక ఏర్పడడం, మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం కూలిపోవడంతో 1980లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున కొమ్మూరు అప్పలస్వామి పోటీ చేసి, కాంగ్రెస్‌ (యు) అభ్యర్థి భాట్టం శ్రీరామ్మూర్తిపై లక్షా 35 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

టీడీపీ రాకతో మారిన చిత్రం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత విశాఖ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు విజయాలు అటూ, ఇటూగా ఉంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. టీడీపీ ఆవిర్భావం తరువాత 1984లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి...కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి అప్పలస్వామిపై లక్షా 41 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఆ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీయగా రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం, మిత్రపక్షాలు ఘన విజయం సాధించడం గమనార్హం. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విజయనగరం రాజవంశీకుల కోడలు ఉమాగజపతిరాజు (పూసపాటి ఆనందగజపతిరాజు భార్య), టీడీపీ అభ్యర్థి ఎం.వి.వి.ఎస్‌.మూర్తిపై 26 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. గత అభ్యర్థులే మరోసారి ముఖాముఖి తలపడగా ఈసారి టీడీపీ అభ్యర్థి ఎం.వి.వి.ఎస్‌.మూర్తి 3,678 ఓట్ల మెజారిటీతో ఉమాగజపతిరాజుపై గెలిచారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు బలంగా వీచినా ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన టి.సుబ్బిరామిరెడ్డి 6 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పి.ఆనందగజపతిరాజుపై గెలిచారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా మళ్లీ వీరిద్దరే తలపడ్డారు. ఈసారి కూడా సుబ్బిరామిరెడ్డినే విజయం వరించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డి.వి.సుబ్బారావుకు లక్షా75 వేల ఓట్లు వచ్చాయి. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎం.వి.వి.ఎస్‌.మూర్తి దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డిపై గెలిచారు. ఇక 2004 ఎన్నికల్లో మూర్తి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి, వూజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి చేతిలో లక్ష పైచిలుకు ఓట్లతేడాతో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ అభ్యర్థిగా ఎం.వి.వి.ఎస్‌.మూర్తి, ప్రజారాజ్యం తరపున పల్లా శ్రీనివాసరావు పోటీపడ్డారు. పురందేశ్వరి విజయం సాధించగా, పీఆర్‌పీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ద్వితీయ స్థానం సాధించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేశారు. జనసేన మద్దతు ప్రకటించింది. ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో దిగిన కంభంపాటి హరిబాబు (బీజేపీ) సుమారు 90 వేల మెజారిటీతో వైసీపీ తరపున బరిలో దిగిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయలక్ష్మిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వైసీపీ మధ్య పోటీ జరిగింది. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు, తెలుగుదేశం అభ్యర్థి ఎం.శ్రీభరత్‌కు 4,32,496 ఓట్లు, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874 ఓట్లు, బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరికి 33,892 ఓట్లు వచ్చాయి.

లోక్‌సభకు మహామహులు

పోరాట యోధుడు తెన్నేటి విశ్వనాఽథం, విజయనగరం రాజవంశానికి చెందిన పి.వి.జి.రాజు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు సత్యనారాయణ, స్వాతంత్య్ర సమరయోధుడు భాట్టం శ్రీరామమూర్తి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి వంటి మహామహులను లోక్‌సభకు పంపిన ఘనత విశాఖపట్నం ఓటర్లకే దక్కుతుంది.

తొలి ఎన్నికల్లో ద్విసభ్యత్వ నియోజకవర్గం.... ఇద్దరు ఎంపీలు

పార్లమెంటుకు 1951లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కొన్ని ద్విసభ్యత్వ నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో విశాఖపట్నం ఒకటి. ఒకరు జనరల్‌, మరొకరు రిజర్వుడ్‌ అభ్యర్థి ఉండేవారు. ప్రతి ఓటరుకు రెండు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అత్యధిక ఓట్లు వచ్చిన మొదటి ఇద్దరిని విజేతలుగా ప్రకటిస్తారు. 1951వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విశాఖ నుంచి నలుగురు పోటీ చేయగా, గాం మల్లుదొర మధ్యలో పోటీ నుంచి వైదొలిగారు. మిగిలిన ముగ్గురిలో లంకా సుదరం (ఇండిపెండెంట్‌)కు 1,40,718 ఓట్లు, కె.సుబ్బరాజు (కాంగ్రెస్‌)కు 1,24,102 ఓట్లు, ఇ.సీతయ్యనాయుడు (ఇండిపెండెంట్‌)కు 74,656 ఓట్లు వచ్చాయి. దీంతో లంకా సుదరం, కె.సుబ్బరాజులను విజేతలుగా ప్రకటించారు. తరువాత ఎన్నికల నాటికి ద్విసభ నియోజకవర్గాలు రద్దయ్యాయి.

1951 నుంచి 2019 ఎన్నికల వరకు విశాఖ నుంచి గెలుపొందిన ఎంపీలు

ఎన్నిక విజేత పార్టీ మెజారిటీ ప్రత్యర్థి పార్టీ

1951 లంకా సుందరం ఇండిపెండెంట్‌---- ఇ.సీతయ్యనాయుడు కేఎల్‌పీ

కె.సుబ్బరాజు కాంగ్రెస్‌ ------ గాం మల్లుదొర ఇండిపెండెంట్‌

1957 పీవీజీ రాజు ఇండిపెండెంట్‌ 61,114 ఎంవీ కృష్ణారావు కాంగ్రెస్‌

1962 పి.విజయ్‌ ఆనంద్‌ (విజ్జి) కాంగ్రెస్‌ 91,142 మద్ది పట్టాభిరెడ్డి ఇండిపెండెంట్‌

1967 తెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్‌ 34,073 పి.వెంకటరావు కాంగ్రెస్‌

1971 పీవీజీ రాజు ఇండిపెండెంట్‌ 67,188 తెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్‌

1977 ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్‌ 42,829 తెన్నేటి విశ్వనాథం జనతా

1980 కొమ్మూరు అప్పలస్వామి కాంగ్రెస్‌(ఐ) 34,635 భాట్టం శ్రీరామ్మూర్తి కాంగ్రెస్‌(యు)

1984 భాట్టం శ్రీరామ్మూర్తి తెలుగుదేశం 1,40,431 కొమ్మూరు అప్పలస్వామి కాంగ్రెస్‌

1989 పి.ఉమాగజపతిరాజు కాంగ్రెస్‌ 25,733 ఎంవీవీఎస్‌ మూర్తి తెలుగుదేశం

1991 ఎంవీవీఎస్‌ మూర్తి తెలుగుదేశం 5,138 పి.ఉమాగజపతిరాజు కాంగ్రెస్‌

1996 టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్‌ 7,279 పి.ఆనందగజపతిరాజు తెలుగుదేశం

1998 టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్‌ 61,517 పి.ఆనందగజపతిరాజు తెలుగుదేశం

1999 ఎంవీవీఎస్‌ మూర్తి తెలుగుదేశం 38,919 టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్‌

2004 ఎన్‌.జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ 1,30,571 ఎంవీవీఎస్‌ మూర్తి తెలుగుదేశం

2009 డి.పురందేశ్వరి కాంగ్రెస్‌ 64,974 పల్లా శ్రీనివాసరావు ప్రజారాజ్యం

2014 కంభంపాటి హరిబాబు బీజేపీ 90,488 వైఎస్‌ విజయలక్ష్మి వైసీపీ

2019 ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ 4,410 ఎం.శ్రీభరత్‌ తెలుగుదేశం

Updated Date - Apr 27 , 2024 | 01:52 AM