మోటూరుపాలెంలో డయేరియా
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:05 AM
మండలంలోని దిబ్బపాలెం సచివాలయం-1 పరిధిలో గల మోటూరుపాలెంలో నిల్వ ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పీహెచ్‌సీ వైద్యబృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.

నిల్వ ఆహారం తిని అస్వస్థతకు గురైన కుటుంబం
గ్రామంలో వ్యాధి బారిన 9 మంది
అప్రమత్తమైన వైద్యబృందం
అనకాపల్లి ఆస్పత్రికి తరలింపు
గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌ఓ బృందం
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
అచ్యుతాపురం, జూలై 4: మండలంలోని దిబ్బపాలెం సచివాలయం-1 పరిధిలో గల మోటూరుపాలెంలో నిల్వ ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పీహెచ్‌సీ వైద్యబృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..
మోటూరుపాలెంకి చెందిన ఒక కుటుంబం నిల్వ ఆహారం తినడంతో నలుగురు వాంతులు, విరోచనాలతో మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరు అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది విషయాన్ని ఎంపీడీఓ సురేష్ కుమార్‌కు తెలిపారు. వీరంతా గ్రామాన్ని సందర్శించి, వ్యాధి సోకడానికి కారణాలను తెలుసుకున్నారు. నిల్వ ఆహారం తిన్న ఇంటికి మరుగుదొడ్డి లేకపోవటంతో ఇంటి వెనుక ఒక దడి కట్టి దానికి బహిర్భూమిగా వాడుతున్నారు. అధికారుల బృందం పరిశీలన జరిపేటప్పటికి అక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంది. దీంతో ఈగలు ద్వారా పక్కనున్న ఇంటిలో మరో ఐదుగురికి వాంతులు, విరోచనాలు కావడంతో వారిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరిని గురువారం డిస్చార్జి చేశారు. మరో ముగ్గురు అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి అదుపులో ఉందని వైద్యులు తెలిపారు. గురువారం డీఎంహెచ్‌వో డాక్టర్ బాలాజీ, డీఐఓ డాక్టర్ చంద్రశేఖర్, ఎపిడమిక్ డాక్టర్ సతీష్, డాక్టర్ విజయకుమార్ గురువారం మోటూరుపాలెం వెళ్లి పరిశీలన జరిపారు. అక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ని ఏర్పాటుచేశారు.