Share News

డెంగ్యూ బెల్స్‌

ABN , Publish Date - May 21 , 2024 | 12:55 AM

నగరంలో ఈ ఏడాది అప్పుడే డెంగ్యూ కేసులు వెలుగుచూస్తున్నాయి.

డెంగ్యూ బెల్స్‌

  • ఈ ఏడాది అప్పుడే వెలుగుచూస్తున్న కేసులు

  • ఇప్పటివరకూ 140 నమోదైనట్టు మలేరియా శాఖ నిర్ధారణ

  • వర్షాలు కురుస్తుండడంతో దోమలు వ్యాప్తి

  • అధికారులు మేల్కొనకుంటే సీజన్‌లో మరింత పెరిగే అవకాశం

  • జీవీఎంసీ అధికారులు కార్యాచరణ

  • హైరిస్క్‌ ప్రాంతాల్లో లార్వా గుర్తింపునకు సర్వే లెన్స్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఈ ఏడాది అప్పుడే డెంగ్యూ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో దోమల వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల రోజులు ముందుగానే డెంగ్యూ కేసుల నమోదు ప్రారంభం కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ఏటా జూన్‌లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు ప్రారంభమవుతుంటాయి. దీనివల్ల వాతావరణ చల్లబడుతుంది. ఇది దోమల వ్యాప్తికి అనుకూలంగా మారుతుంది. వర్షాకాలంలో పారిశుధ్యలోపం తలెత్తుతుంది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు పేరుకుపోవడం, డ్రైనేజీ పొంగి రోడ్లపైకి చేరుకోవడం, వర్షం నీరు ప్లాస్టిక్‌ కవర్లు, కొబ్బరి బొండాలు, పూలకుండీల్లో నిల్వ ఉండిపోవడం వల్ల దోమల వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణ దోమలతోపాటు డెంగ్యూ కారక దోమలు (ఈడిస్‌) కూడా విజృంభిస్తుంటాయి. వీటన్నింటి కారణంగా ఏటా జూన్‌ నుంచి డిసెంబరు వరకూ డెంగ్యూ కేసుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ బారినపడినవారు సకాలంలో చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దీంతో డెంగ్యూ అంటే ప్రజలతోపాటు జీవీఎంసీ అధికారుల్లో ఆందోళన మొదలవుతుంది.

నగరంలో ఏటా జూన్‌ నుంచి డిసెంబరు వరకూ 1,500 నుంచి రెండు వేల వరకూ డెంగ్యూ కేసులు నమోదవుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం మే నుంచే డెంగ్యూ కేసుల నమోదు ప్రారంభమైంది. గతకొద్దిరోజులుగా అడపాదడపా వర్షం కురుస్తుండడంతో వాతావరణం చల్లబడి దోమల వ్యాప్తికి అనుకూలంగా మారింది. దీనివల్ల ఇప్పటివరకూ 146 డెంగ్యూ కేసులు నమోదవ్వగా వీటిలో దాదాపు సగం గత రెండు రోజుల్లో నమోదైనవేనంటున్నారు. ఈనెల మొదట్లో రోజుకి ఒకటి, రెండు చొప్పున నమోదైతే, ఇటీవల వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. జిల్లా మలేరియా విభాగం అధికారులు నగర పరిధిలో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టు జీవీఎంసీ అధికారులకు రోజువారీ నివేదికలు ఇస్తుంటే...అధికారులు మాత్రం అసలు డెంగ్యూ కేసు ఒక్కటి కూడా నమోదుకావడం లేదని బుకాయిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొమ్మాది ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల యువకుడికి డెంగ్యూ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేజీహెచ్‌లో చేర్పించారు. బాధితుడిని జిల్లా మలేరియా అధికారిని స్వయంగా వెళ్లి పరామర్శించారు. అయినప్పటికీ జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు మాత్రం అలాంటి కేసులు అధికారికంగా నిర్ధారణ కావడం లేదని చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలను చూపించేసరికి...ఒక కేసు మాత్రమే నమోదైందని, అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్‌ చేసి, రెండుచోట్ల దోమల బ్రీడింగ్‌ గుర్తించి నాశనం చేశామని, ఆప్రాంతంలోని 151 ఇళ్లలో ఫాగింగ్‌ కూడా చేశామని చెప్పడం చూస్తే...జీవీఎంసీ అధికారులు డెంగ్యూపై గోప్యత పాటిస్తున్నారని అర్థమయ్యింది.

జీవీఎంసీ అధికారులు అప్రమత్తం

డెంగ్యూ కేసులు తీవ్రస్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజారోగ్య విభాగం అధికారులు ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది. మే నెల మధ్యనాటికే 146 డెంగ్యూ కేసులు నమోదైతే, జూన్‌ నాటికి డెంగ్యూ విశ్వరూపం చూడాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటినుంచే దీనిపై దృష్టిసారించకపోతే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందువల్లే నెల రోజులు ముందుగానే దోమల నియంత్రణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్‌ ప్రారంభించారు. ప్రతిరోజూ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోని ఇంటింటికీ వెళ్లి దోమల లార్వాలను గుర్తించి నిర్వీర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారని ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ వివరించారు. డెంగ్యూ తీవ్రత గత ఏడాదితో పోల్చితే తక్కువగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. జిల్లా మలేరియా విభాగం ఇచ్చే నివేదికలో డెంగ్యూ కేసులు ఉన్నట్టు చెబుతుంటే, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం మాత్రం అలాంటి కేసులు లేవని చెప్పడం గురించి ప్రశ్నించగా...క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నరేష్‌కుమార్‌ అన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:55 AM