Share News

రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:47 AM

వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ, వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె గురువారం చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జేపీ అగ్రహారం, కొవ్వూరు, రావికమతం మండలం గంపవానిపాలెం, బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరం, ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరబుపాలెం, వాడ్రాపల్లి, గొల్లలపాలెం గ్రామాల్లో పర్యటించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
మునగపాక మండలం గొల్లలపాలెంలో మొల్లి అప్పలనర్స కుటుంబ సభ్యులకు చెక్కు అందిస్తున్న నారా భువనేశ్వరి

వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు

గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియాకు అడ్డాగా ఏపీ

యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవు

ఒక తరం భవిష్యత్తును జగన్‌ నాశనం చేశారు

నారా భువనేశ్వరీ ధ్వజం

వైసీపీ అరాచక పాలనకు ఓటుతో అంతం పలకాలని పిలుపు

టీడీపీ-జనసేన ప్రభుత్వంతో అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా

చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాలు

చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత

భువనేశ్వరిని చూడడానికి భారీగా తరలివచ్చిన మహిళలు

అనకాపల్లి/ రోలుగుంట/ రావికమతం/ బుచ్చెయ్యపేట/, ఫిబ్రవరి 29: వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ, వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె గురువారం చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జేపీ అగ్రహారం, కొవ్వూరు, రావికమతం మండలం గంపవానిపాలెం, బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరం, ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరబుపాలెం, వాడ్రాపల్లి, గొల్లలపాలెం గ్రామాల్లో పర్యటించారు. గత ఏడాది చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్రమనస్తాపానికి గురై గుండెలు ఆగిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కొవ్వూరు, గంపవానిపాలెం, ఆర్‌.భీమవరం గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గ్రామంలో హంసవేణి అనే మహిళ చేతిపంపు నుంచి తాగునీరు రావడం లేదని ఫిర్యాదు చేసిందనే కోపంతో వైసీపీ నాయకులు ఆమెపై దాడి చేసి రెండు కళ్లు పీకేసి తమ రాక్షసత్వాన్ని చూపారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న, కల్తీ మద్యం గురించి ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టనబెట్టుకున్నారని అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలు దిగజారిపోయాయని, ఉద్యోగ/ ఉపాధి అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా మారిపోయారని ఆమె చెప్పారు. ఏపీని గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియాలో నంబరు వన్‌ స్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఒక తరం భవిష్యత్తును జగన్‌ నాశనం చేశాడన్నారు. జగనాసుర పాలనకు మహిళలు తమ శక్తిని చూపించే తరుణం ఆసన్నమైందని, మీ పిల్లలతోపాటు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసి, వైసీపీ రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం ‘సూపర్‌ సిక్స్‌్‌’ను అమలు చేస్తుందని, మహిళలకు మరిన్ని పథకాలను తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు. ‘జగనాసుర పాలనను అంతమొందిస్తాం, చంద్రబాబును మళ్లీ సీఎంను చేస్తాం’ అంటూ మహిళలు విజయ సంకేతం చూపుతూ నినాదాలు చేశారు. రావికమతం మండలం గంపవానిపాలెం సభలో కిత్తంపేటకు చెందిన చెన్నంశెట్టి జగ్గమ్మ మాట్లాడుతూ, వెలుగు సీఏగా పనిచేస్తున్న తాను టీడీపీ సానుభూతురాలని కావడంతో స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తనను ఉద్యోగంలో నుంచి తీసేయించారని కన్నీరుపెట్టుకుంది. భువనేశ్వరి స్పందిస్తూ చంద్రబాబు త్వరలో మళ్లీ సీఎం అవుతారని, వైసీపీ ప్రభుత్వ బాధితులందరికీ న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయిన బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరం గ్రామానికి చెందిన అప్పలబత్తుల అయ్యన్నాచారి భార్య సత్యవతికి రూ.3 లక్షల చెక్కును అందచేశారు.

రావికమతం మండలం గంపవానిపాలెంలో మాకిరెడ్డి పెద్దిమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పిల్లలను బాగా చదివించాలని మృతురాలి కుమారుడు రాజుబాబు, కోడలు భవానీకి సూచించారు. కాగా భువనేశ్వరి గంపవానిపాలెం వస్తున్నట్టు తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జై చంద్రబాబు, జై భువనమ్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు.

రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన సుర్ల దేముడమ్మ, కొవ్వూరు గ్రామంలో యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు.

మునగపాక మండల అరబుపాలెంలో బడ్డేడ నాయుడు, వాడ్రాపల్లిలో ఉల్లూరి అప్పలనరస, ఊల్లూరి మంగయ్యమ్మ, గొల్లలపాలెంలో మొల్లి అప్పలనరస కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మునగపాక మండలంలో పర్యటన అనంతరం భువనేశ్వరి అచ్యుతాపురం బయలుదేరి వెళ్లారు. రాత్రికి అక్కడ బసచేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు.

నారా భువనేశ్వరి పర్యటనలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌.రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గునూరు మల్లునాయుడు, టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, దాడి రత్నాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:47 AM