Share News

రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:45 AM

వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ, వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు

యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవు

ఒక తరం భవిష్యత్తును జగన్‌ నాశనం చేశారు

ధ్వజమెత్తిన నారా భువనేశ్వరి

చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాలు

అనకాపల్లి/ రోలుగుంట/ రావికమతం/ బుచ్చెయ్యపేట/, ఫిబ్రవరి 29:

వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ, వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె గురువారం చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జేపీ అగ్రహారం, కొవ్వూరు, రావికమతం మండలం గంపవానిపాలెం, బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరం, ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరబుపాలెం, వాడ్రాపల్లి, గొల్లలపాలెం గ్రామాల్లో పర్యటించారు. గత ఏడాది చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్రమనస్తాపానికి గురై గుండెలు ఆగిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కొవ్వూరు, గంపవానిపాలెం, ఆర్‌.భీమవరం గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న, కల్తీ మద్యంపై ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టనబెట్టుకున్నారన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం పరువు, ప్రతిష్ఠలు దిగజారిపోయాయని, ఉద్యోగ/ ఉపాధి అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా మారిపోయారన్నారు. ఏపీని గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియాలో నంబరు వన్‌ స్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఒక తరం భవిష్యత్తును జగన్‌ నాశనం చేశాడన్నారు. జగనాసుర పాలనకు మహిళలు తమ శక్తిని చూపించే తరుణం ఆసన్నమైందని, మీ పిల్లలతోపాటు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసి, వైసీపీ రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం ‘సూపర్‌ సిక్స్‌్‌’ను అమలు చేస్తుందని, మహిళలకు మరిన్ని పథకాలను తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Mar 01 , 2024 | 12:45 AM