Share News

సర్టిఫికెట్ల జారీలో జాప్యం

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:38 AM

గ్రామ/ వార్డు సచివాలయాల్లో అన్ని రకాల సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని గొప్పులు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన స్టేషనరీని మాత్రం సమకూర్చడంలేదు. దీంతో సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

సర్టిఫికెట్ల జారీలో జాప్యం
గ్రామ సచివాలయం

సచివాలయాల్లో స్టేషనరీ కొరత

సరఫరా చేయని ప్రభుత్వం

కొన్నిచోట్ల సొంతసొమ్ముతో సమకూరుస్తున్న సర్పంచులు

చోడవరం, జనవరి 5: గ్రామ/ వార్డు సచివాలయాల్లో అన్ని రకాల సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని గొప్పులు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన స్టేషనరీని మాత్రం సమకూర్చడంలేదు. దీంతో సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సర్టిఫికెట్లను జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్‌ కార్యాలయాలు, వీ-సేవా కేంద్రాల నుంచి తొలగించి సచివాలయాలకు అప్పగించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల జారీకి అవసరమైన స్టేషనరీని తొలుత అన్ని సచివాలయాలకు బాగానే సరఫరా చేశారు. అయితే ఇటీవల కాలంలో సర్టిఫికెట్లకు అవసరమైన పేపర్‌ను సరఫరా చేయకపోవడంతో చాలా సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీకి ఇబ్బందులు తలెత్తుతున్నట్టు సిబ్బందితోపాటు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. సచివాలయాలకు స్టేషనరీ వస్తే తప్ప సర్టిఫికెట్లు జారీచేయలేమని సచివాలయ సిబ్బంది చెబుతుండడంతో, సంబంధిత దరఖాస్తుదారులు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

సచివాలయాలకు సరఫరా చేసిన స్టేషనరీలో సింహభాగం రెండు నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఆరు రకాల సర్టిఫికెట్ల జారీ కోసం నిర్వహించిన శిబిరాల సందర్భంగా భారీగా ఉపయోగించేశారు. దీనితో చాలా సచివాలయాల్లో స్టేషనరీ నిండుకుంది. కొన్ని పంచాయతీల సర్పంచులు సొంత సొమ్ముతో స్టేషనరీ కొనుగోలు చేసి సచివాలయాలకు అందజేయగా, ఇప్పటికే నిధులు లేక విలవిల్లాడుతున్న పంచాయతీల సర్పంచులు ఇలాంటి ఖర్చుల విషయంలో చేతులెత్తేశారు. దీంతో అత్యధిక సచివాలయాల్లో సర్టిఫికెట్లు జారీ చేయడంలేదని తెలిసింది. చోడవరం మండలంలో లక్కవరంతోపాటు మరికొన్ని సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీకి పేపర్‌ కొరత ఉన్నట్టు సమాచారం. అయితే సచివాలయాల సిబ్బంది ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా, సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందంటూ దాటవేస్తున్నారు. కాగా చోడవవరం మండలంలోని సచివాలయాల్లో స్టేషనరీ సమస్యపై ఈవోపీఆర్‌డీ బి.చైతన్యను వివరణ కోరగా, కొన్ని సచివాలయాలకు స్టేషనరీ పేపర్‌ అందుబాటులో ఉంచామని తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 12:38 AM