Share News

పెన్షన్ల పంపిణీలో జాప్యం

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:00 AM

రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని కావాలనే జాప్యం చేస్తోంది.

పెన్షన్ల పంపిణీలో జాప్యం

ఉద్దేశపూర్వకంగానే...

మధ్యాహ్నం 3 గంటల తరువాత బ్యాంకుల నుంచి డ్రా

వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే పంపిణీ చేస్తామన్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం

పండు ముసలోళ్లు సైతం సచివాలయాలకు రాక

అక్కడ కూడా అరకొరగా సిబ్బంది

తెలుగుదేశం వల్లే జాప్యం జరిగిందనే వైసీపీ సర్కారు తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని కావాలనే జాప్యం చేస్తోంది. లబ్ధిదారులంతా ఇబ్బంది పడాలని, దానికి తెలుగుదేశమే కారణమని భావించేలా వ్యవహరిస్తోంది. ఈ ఉద్దేశంతోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి పరిమిత సిబ్బందిని కేటాయించింది. మిగిలిన వారంతా ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని చెబుతోంది. జిల్లా అధికారులు కూడా పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలనే చెబుతున్నారు గానీ త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి పెట్టడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తొలిరోజు (బుధవారం) తీవ్ర జాప్యం చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ల మొత్తం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ఈ విషయం పింఛన్‌దారులకు తెలిసేలా ప్రచారం కూడా నిర్వహించలేదు. దాంతో పండు ముదుసళ్లు కూడా ఊతకర్ర చేతపట్టుకొని, ఎవరినో ఒకరిని తోడు తీసుకుని సచివాలయాలకు వచ్చారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసి, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయం కూడా వారికి చేరవేయలేదు. దాంతో వారంతా ఉదయం పది గంటలకే సచివాలయాలకు వచ్చి కూర్చున్నారు. అక్కడ కూడా తగిన ఏర్పాట్లు లేవు. కేవలం నలుగురు కూర్చోడానికే కుర్చీలు వేశారు. మిగిలిన వారంతా నిల్చోవాల్సి వచ్చింది. జిల్లాలో తొలిరోజు పింఛన్ల పంపిణీ చాలా మందకొడిగా సాగింది. చాలా సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ బాధ్యతలు తీసుకున్న సిబ్బంది తప్పితే మిగిలినవారు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.

వారంతా ఎక్కడ?

సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ బాధ్యత వీఆర్‌ఓ, వెల్ఫేర్‌ సెక్రటరీలకు అప్పగించారు. వాస్తవానికి ఆయా కార్యాలయాల్లో ఇంకా చాలామంది ఉద్యోగులు ఉన్నారు. ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ప్లానింగ్‌, హెల్త్‌, ఎనర్జీ సెక్రటరీలు, వారి సహాయకులు మహిళా పోలీసులు ఉన్నారు. వీరంతా ఎన్నికల విధుల్లో ఉన్నారని సమాధానం ఇస్తున్నారు. ఎనర్జీ, ప్లానింగ్‌, హెల్త్‌, పోలీస్‌ సిబ్బందికి ఎటువంటి అదనపు పనులు లేవు. వారికి పింఛన్ల మొత్తం ఇచ్చి, ఇంటింటికీ పంపిణీ చేయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టి ఉండేది. వలంటీర్లతో ఒకటో తేదీనే 90 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయించేది. అంత మంది సిబ్బందిని పెట్టుకొని రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు రోజుల సమయం తీసుకుంటోంది. మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఇస్తామని ప్రకటించారు. కావాలని ఆలస్యం చేసి, ఆ నింద తెలుగుదేశంపైనే నెట్టడానికే వైసీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారు.

తొలిరోజు 51.64 శాతం పంపిణీ

విశాఖ జిల్లాలో తొలిరోజు బుధవారం 51.64 శాతం పింఛన్ల మొత్తం పంపిణీ చేసినట్టు అధికారులు తెలియజేశారు. రూ.25.97 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందించామన్నారు. పెందుర్తి మండలంలో అత్యధికంగా 73.04 శాతం పంపిణీ చేయగా, జోన్‌-5 కార్యాలయం పరిధిలో అతి తక్కువగా 32.43 శాతం అందించారు.

Updated Date - Apr 04 , 2024 | 02:00 AM