Share News

డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో..!?

ABN , Publish Date - May 26 , 2024 | 12:40 AM

డిగ్రీ ప్రవేశాల విషయంలో ఉన్నత విద్యా శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. గత ఏడాది కూడా ఇలాగే ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడంతో అనేక కాలేజీల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి.

డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో..!?

ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై నెల రోజులు దాటింది

డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటివరకూ విడుదల కాని షెడ్యూల్‌

గత ఏడాది జాప్యం కావడంతో భారీగా మిగిలిపోయిన సీట్లు

ఈ ఏడాదీ అదే పరిస్థితి తలెత్తేలా ఉందని కళాశాలల యాజమాన్యాల ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

డిగ్రీ ప్రవేశాల విషయంలో ఉన్నత విద్యా శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. గత ఏడాది కూడా ఇలాగే ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడంతో అనేక కాలేజీల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని సుమారు 60కిపైగా కాలేజీల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీకాలేదు. దీనికి ప్రధాన కారణం అడ్మిషన్లు ఆలస్యం కావడమేనని కాలేజీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేశాయి. గత ఏడాది తలెత్తిన ఇబ్బందులను కనీసం ఈ ఏడాదైనా ఎదురుకాకుండా ఉండాలంటే వేగంగా అడ్మిషన్లు ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నత విద్యా శాఖకు పలు కాలేజీలు ప్రతినిధులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఉన్నత విద్యా శాఖ పట్టించుకోనట్టు లేదు. అందుకే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై నెల రోజులైనా ఇప్పటివరకూ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేదు. షెడ్యూల్‌ విడుదల చేసిన తరువాత మూడు దశల్లో అడ్మిషన్లు ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం రెండు నెలలు సమయం పడుతుందని, అది కూడా వేగంగా చేస్తేనేనని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రవేశాలు కల్పించడం ఆలస్యమైతే సీట్లు భారీగా మిగిలిపోతాయని చెబుతున్నారు. ఉన్నత విద్యా శాఖ వీలైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నారు.

మిగులుతున్న సీట్లు..

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 192 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 165 ప్రైవేటు, 23 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌, మూడు అటానమస్‌ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలో సుమారు 35 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. సాధారణంగా అయితే 60 నుంచి 70 శాతం మేర సీట్లు భర్తీ అవుతుంటాయి. అయితే, గడిచిన మూడేళ్ల నుంచి అడ్మిషన్లు ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. గత ఏడాది అడ్మిషన్లు ప్రక్రియను ఆలస్యంగా నిర్వహించడం, మూడు విడతలకు మధ్య ఎక్కువ రోజులు ఖాళీ రావడంతో ప్రవేశాలు మరింత తగ్గాయి. గత విద్యా సంవత్సరం దాదాపు 80కిపైగా కాలేజీల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీకాలేదు. కొన్ని గ్రూపుల్లో అయితే 10 నుంచి 15 మంది మాత్రమే చేరారు. విద్యార్థులు సంఖ్య తగ్గిన అనేక గ్రూపుల్లో అడ్మిషన్లు నిలిపివేయాలని ఆయా కాలేజీలు నిర్ణయించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అయినా ప్రవేశాలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నత విద్యాశాఖను ప్రైవేటు కాలేజీల అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. వేగంగా అడ్మిషన్లు ప్రక్రియను చేపడితే..ప్రవేశాలు పెరుగుతాయని, తద్వారా కాలేజీల నిర్వహణ సులభతరమవుతుందన్న భావనను వ్యక్తం చేశారు. అయితే, కాలేజీల వినతిని ఉన్నత విద్యా శాఖ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికీ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఇవ్వలేదు. దీంతో గత ఏడాది మాదిరిగానే జాప్యం జరిగే అవకాశం ఉందని వాపోతున్నాయి. ఆగస్టు నెలలోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే కొంతలో కొంతైనా మేలు కలుగుతుందన్న భావనను ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు వ్యక్తంచేస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖ ఎప్పటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తుందో చూడాలి.

Updated Date - May 26 , 2024 | 12:40 AM