పెల్లుబుకిన ప్రభుత్వ వ్యతిరేకత?
ABN , Publish Date - May 16 , 2024 | 01:24 AM
‘‘వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. పైగా ప్రతిపక్షాలకు చెందిన ఆస్తులపై దాడులు. ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలకు దారితీసేలా కనిపించాయి. జగన్‌కు పాలనా అనుభవం లేదని స్పష్టంగా తేలింది. వ్యక్తిగత లబ్ధి, ద్వేషం కంటే... రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది. అందుకే నాతోపాటు నా సర్కిల్‌లోని ఎంతో మంది ఉదయాన్నే వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటేసి వచ్చాం’’ - నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు
వైసీపీపై పలు వర్గాల్లో స్పష్టంగా కనిపించిన అసంతృప్తి
కూటమి అభ్యర్థులకు ఓట్ల వర్షం
జగన్ పాలనపై యువత,
నిరుద్యోగులు, విద్యావంతుల్లో అసహనం
నిత్యావసర ధరలు, విద్యుత్/ఆర్టీసీ చార్జీల పెంపు ప్రధాన కారణం
మహిళలను ఆకర్షించిన కూటమి మేనిఫెస్టో
ఉమ్మడి విశాఖ జిల్లాలోని
అనేక నియోజక వర్గాల్లో ఇదే ట్రెండ్
స్థానిక పరిస్థితుల మేరకు మూడు, నాలుగు
నియోజక వర్గాల్లోనే వైసీపీ అభ్యర్థులకు కాస్త సానుకూలత
మిగిలినచోట్ల కూటమి వైపు మొగ్గు చూపిన ఓటర్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. పైగా ప్రతిపక్షాలకు చెందిన ఆస్తులపై దాడులు. ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలకు దారితీసేలా కనిపించాయి. జగన్‌కు పాలనా అనుభవం లేదని స్పష్టంగా తేలింది. వ్యక్తిగత లబ్ధి, ద్వేషం కంటే... రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది. అందుకే నాతోపాటు నా సర్కిల్‌లోని ఎంతో మంది ఉదయాన్నే వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటేసి వచ్చాం’’
- నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు
‘‘ఐదేళ్లలో నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో నిరాశపరి చింది. ఈ ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కుటుం బ సభ్యులతోపాటు బంధువులతోనూ కూటమి అభ్యర్థులకు ఓటు వేయించాను’’
- ఒక నిరుద్యోగి
సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీపై అనేక వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, విద్యావంతులు, వ్యాపారులు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీకి వ్యతి రేకంగా ఓటేసినట్టు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, పాలనా వైఫల్యాలతో విసిగి పోయిన ఎంతోమంది మార్పు కావాలని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా మాట్లాడుకోవడం వినిపించింది. ముఖ్యంగా యువ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. వీరిలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నవారు, కోర్సులు పూర్తిచేసి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు రాక ఇళ్లల్లోనే ఉంటున్నవారు ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు చెబు తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా లక్షలాది మంది నిరుద్యోగులకు సీఎం జగన్ అన్యాయం చేశారని, అందుకే బెంగళూరు నుంచి వచ్చి మరీ కూటమి అభ్యర్థులకు ఓటేశానని ప్రసన్నకుమార్ అనే యువకుడు వెల్లడించాడు. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా ఈ ప్రభుత్వం అవకాశాలను కల్పించలేకపోయిందని, చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఆలోచనతో కూటమికి ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చానని రాజేష్ అనే యువకుడు తెలిపాడు. తనలాగే ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వివరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో నూజివీడులో కోచింగ్ తీసుకుంటున్న 20 మంది వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటేశామని సరిత అనే యువతి చెప్పింది. గడిచిన ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిందని, వ్యాపారాలు తగ్గుముఖం పట్టడంతో వెంచర్లు వేయడమే మానేశామని నగరానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు గడిచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరు, న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా చేపట్టిన అనేక కార్యక్రమాలు, నగర పరిధిలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఆస్తులపై దాడులు వంటివి ఆందోళన కలిగించాయని, మరోసారి అధికారాన్ని కట్టబెడితే ఏం చేస్తారన్న భయంతో కూటమికి ఓటేశానని ఓ ప్రైవేటు కాలేజీ లెక్చరర్ పేర్కొన్నారు.
నిరుపేద వర్గాల్లోనూ...
గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, మాల్స్, ఇతర దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగులు కూడా ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా కనిపించారు. పెరిగిన ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు వంటి అంశాలు ఈ వర్గాలను వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా ప్రభావితం చేసినట్టు చెబుతున్నారు. నెలకు రూ.15 వేలు వేతనం ఇస్తున్నారని, ఆ మొత్తం ఇంటి అద్దె, నిత్యావసర సరకుల కొనుగోలుకే సరిపోతోందని, బతకడం కష్టంగా ఉంటోందని రవి అనే ప్రైవేటు ఉద్యోగి వాపోయారు. కూటమి అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ భారమైనా తగ్గుతుందని, తన భార్య కూడా వస్త్ర దుకాణంలో పని చేస్తోందని, ఆమెకు బస్‌చార్జీలు కూడా మిగులుతాయని కూటమికి ఓటేశామన్నారు. కూటమి ప్రవేశపెడతామని చెబుతున్న పథకాలు బాగున్నాయని, అందుకే ఓటేశానని లక్ష్మి అనే గృహిణి పేర్కొన్నారు. జగన్ వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు రూపాయి కూడా సాయం చేయలేదని, గత ఎన్నికల్లో జగన్ కోసం పది మందితో ఓట్లేయించానని, ఈ ఎన్నికల్లో 20 మందికి చెప్పి మరీ కూటమికి ఓట్లేసేలా చేశానని రామారావు అనే తాపీమేస్ర్తీ పేర్కొన్నాడు. ఏదిఏమైనా అన్ని వర్గాల్లోనూ వైసీపీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది.