Share News

ఆగని గిరి విద్యార్థుల మరణాలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:39 AM

మన్యంలో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు. ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు హెల్త్‌ వలంటీర్ల నియామకంపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది గిరిజన విద్యార్థుల మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఆగని గిరి విద్యార్థుల మరణాలు
విద్యార్థుల మరణాలపై ఐటీడీఏ ముందు రిలే దీక్షలు చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

- తాజాగా కొయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థి మృతి

- వరుస మరణాలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలు

- ఈ విద్యా సంవత్సరంలో 12 మంది మృత్యువాత

- ఆశ్రమాల్లో హెల్త్‌ వలంటీర్ల నియామకంపై సర్కారు నిర్లక్ష్యం

- దీనిపై స్పందించి లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

- మరణాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు, తల్లిదండ్రుల డిమాండ్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థులు మృతి చెందుతున్నారు. తాజాగా కొయ్యూరు బాలురు గురుకులంలో పదో తరగతి చదువుతున్న జి.ప్రవీణ్‌కుమార్‌ అనే విద్యార్థి కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. గతవారం పాడేరులోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు బాలికలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గతేడాది డిసెంబరులో జి.మాడుగుల కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న పాంగి కమల(12), ఈ ఏడాది జనవరిలో ఎనిమిదో తరగతి విద్యార్థిని వంతాల రాణి(14) మృతి చెందారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల- 2లో ఏడో తరగతి విద్యార్థినులు ఎల్‌.రాజ్యలక్ష్మి(13) పచ్చకామెర్లతో గతేడాది జూన్‌లో, వి.లావణ్య(13) టైఫాయిడ్‌తో, డిసెంబరులో ఆరో తరగతి విద్యార్థి కె.మీనాలక్ష్మి(12) టైఫాయిడ్‌తో మృతి చెందారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాల-1లో తొమ్మిదో తరగతి చదువుతున్న జె.అనిల్‌కుమార్‌(15) గతేడాది డిసెంబరులో టైఫాయిడ్‌తో మృతి చెందగా, పెదబయలు మండలం రూడకోట ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి కె.సోమేశ్‌(12) గతేడాది అక్టోబరులో కడుపునొప్పితో మృతి చెందాడు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని పి.లావణ్య(11) గతేడాది అక్టోబరులో ఫిట్స్‌లో మృతి చెందింది. కాగా గతేడాది డిసెంబరులో డుంబ్రిగుడలోని ఆశ్రమ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి బురిడి సంతోశ్‌కుమార్‌(12) గెడ్డలో స్నానానికి వెళ్లి మునిగిపోయి మృతి చెందాడు. ఈ లెక్కన కేవలం ఈ విద్యా సంవత్సరంలోనే 12 మంది గిరిజన విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. ఇలా వెలుగులోకి రాని విద్యార్థుల మరణాలెన్నో తెలియని పరిస్థితి. వివిధ కారణాలతో మృతి చెందడంతో ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా లేని దుస్థితి కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు హెల్త్‌ వలంటీర్ల నియామకంపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సైతం ఆశ్రమ పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య రక్షణపై కనీసం దృష్టిపెట్టడడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సబ్‌కలెక్టర్‌గా పని చేసిన ఆయన ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన ఈ పది నెలల్లో ఆశ్రమ పాఠశాలల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆఖరికి ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలతో ఒక్క సమావేశాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు. పలువురి ఒత్తిడి మేరకు ఎట్టకేలకు తాజాగా ఈ నెల 20న ఆశ్రమ విద్యపై అధికారులు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఐటీడీఏ పీవో ఆశ్రమ పాఠశాలను తరచూ సందర్శిస్తూ, వాటిని పర్యవేక్షిస్తుండాలి. కానీ అటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని పరిస్థితి కొనసాగుతున్నది.

42 రోజులు దీక్షలు చేసినా స్పందించని సర్కారు

ఏజెన్సీలో గిరిజన విద్యార్థుల మరణాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌పై గత ఏడాది ప్రజాసంఘాల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ముందు 42 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఐక్య వేదిక కన్వీనర్‌ కూడా రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. గిరి విద్యార్థుల మరణాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలని, మరణాలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోగా విద్యార్థుల మరణాల నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అందువల్లే ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయని ఐక్యవేదిక కన్వీనర్‌ కూడా రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు.

లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ఏజెన్సీలో గిరిజన విద్యార్థుల మరణాలపై మావోయిస్టులు సైతం స్పందించారు. ఈ మేరకు ఈ నెల 14న మీడియాకు లేఖ విడుదల చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన విద్యార్థులు మృతి చెందుతున్నారని, అందుకు బాధ్యులైన పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని సైతం మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు పోషకాహారాన్ని, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. విద్యార్థుల మరణాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ నేత విశాఖ, అల్లూరి, అనకాపల్లి డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ ఆ లేఖలో డిమాండ్‌ చేశారు.

చేపట్టాల్సిన చర్యలివి

- విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థులకు ప్రతి నెలా విధిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

- అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక స్టూడెంట్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలి.

- స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలి.

- ప్రతి ఆశ్రమ పాఠశాలల్లోనూ హెల్త్‌ వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా విద్యార్థుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి.

- మండల స్థాయిలో విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై మండల ప్రత్యేకాధికారి, ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షణ చేయాలి.

- గిరి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు మన్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టాలి.

- విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ప్రతి రోజు క్లాస్‌ టీచర్‌ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలి.

Updated Date - Feb 27 , 2024 | 12:39 AM