Share News

మృత్యు శకటం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:34 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి సంబంధించి సీఐ బుచ్చిరాజుతో పాటు స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దుప్పితూరుకు చెందిన గొల్లపల్లి శేఖర్‌ (19), నర్మాల అమల (38), కశింకోట మండలం ఉగ్గినపాలేనికి చెందిన డి.జ్యోతిప్రకాష్‌ (14)లు మధ్యాహ్నం సుమారు 11.30 గంటలకు బైక్‌పై ఎలమంచిలి వైపు వెళుతున్నారు. అచ్యుతాపురం జంక్షన్‌ సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి ఫ్లైయాష్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొంది.

మృత్యు శకటం
లారీ ముందు చక్రాల కింద ఉన్న బైక్‌

- అచ్యుతాపురంలో ముగ్గురిని బలిగొన్న లారీ

బాబా ఆలయానికి వెళుతూ...అనంత లోకాలకు

అచ్యుతాపురంలో రోడ్డు ప్రమాదం

బైక్‌ను ఢీకొన్న లారీ

ముగ్గురి మృతి

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 11: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి సంబంధించి సీఐ బుచ్చిరాజుతో పాటు స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దుప్పితూరుకు చెందిన గొల్లపల్లి శేఖర్‌ (19), నర్మాల అమల (38), కశింకోట మండలం ఉగ్గినపాలేనికి చెందిన డి.జ్యోతిప్రకాష్‌ (14)లు మధ్యాహ్నం సుమారు 11.30 గంటలకు బైక్‌పై ఎలమంచిలి వైపు వెళుతున్నారు. అచ్యుతాపురం జంక్షన్‌ సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి ఫ్లైయాష్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు లారీ వెనుక చక్రాల కింద నలిగి మృతిచెందారు. చుట్టుపక్కల వాళ్లు శేఖర్‌, అమలను దుప్పితూరు వాసులుగా గుర్తుపట్టి బంధువులకు సమాచారం అందించారు. అయితే జ్యోతిప్రకాష్‌ తల ఛిద్రం అవడంతో ఎవరూ పోల్చుకోలేకపోయారు. శేఖర్‌ స్నేహితులు దుస్తులను బట్టి జ్యోతిప్రకాశ్‌గా గుర్తుపట్టారు. ఉగ్గినపాలేనికి చెందిన ప్రకాష్‌ పూడిమడక రోడ్డులో గల ఒక నర్సరీలో పనిచేస్తున్నాడని తెలిసింది. ప్రమాదానికి కారణమైన లారీ పరవాడ వద్ద గల ఎన్‌టీపీసీ నుంచి ఫ్లైయాష్‌ను రాజమండ్రి తీసుకువెళుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ శివ పరారైపోయాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బుచ్చిరాజు తెలిపారు.

దుప్పితూరుకు చెందిన అమలకు ఇద్దరు కుమార్తెలు. అమల భర్త చనిపోవడంతో అచ్యుతాపురం-పూడిమడక రోడ్డులో జ్యూస్‌ షాపు పెట్టుకొని వచ్చిన ఆదాయంతో జీవిస్తోంది. ఆమె ఎలమంచిలి రోడ్డులో గల సాయిబాబా గుడికి ప్రతి గురువారం హారతికి వెళుతుంటుంది. అదే విధంగా గురువారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో ఆమె గ్రామానికే చెందిన శేఖర్‌ తన స్నేహితుడు జ్యోతిప్రకాశ్‌తో వెళ్లి అమల షాపు వద్ద జ్యూస్‌ తాగారు. హారతికి సమయం అవుతోందని, తనను సాయిబాబా ఆలయం వద్ద దింపాల్సిందిగా అమల కోరింది. ఆమెను తీసుకుని వెళుతుండగా, గుడి మరో 500 మీటర్ల దూరంలో ఉందనగా ప్రమాదం జరిగింది.

గంటపాటు నరకం చూసిన అమల

ప్రమాదంలో శేఖర్‌, జ్యోతిప్రకాష్‌ అక్కడికక్కడే మరణించగా, అమల మాత్రం ప్రాణాలతో డంపర్‌ వెనుక చక్రాల కింద ఉండిపోయింది. అయితే రెండు చేతులు తెగిపోయాయి. లారీ టైర్‌ కాళ్లమీదకు ఎక్కడంతో శరీరం అంతా ఛిద్రమైపోయింది. రక్షించండి, రక్షించండి అని కేకలు వేసింది. అయినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె సుమారు 40 టన్నుల లోడుతో ఉన్న డంపర్‌ వెనుక టైరు కింద చిక్కుకుపోయింది. దగ్గరలో భారీ క్రేన్‌లు కూడా లేవు. ఆమె ఆ బాధతో అలాగే సుమారు 12.30 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచింది.

రోడ్డుపై బైఠాయించిన బంధువులు

మృతుల కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ బంధువులు ప్రమాద స్థలంలో రహదారిపై బైఠాయించారు. ముగ్గురు ప్రాణాలను పొట్టనబెట్టుకున్న డ్రైవర్‌తో పాటు లారీ యజమానిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పడవాడ డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్నివిధాలా ప్రయత్నించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. లారీ యజమానికి సీఐ బుచ్చిరాజు ఫోన్‌ చేసి అచ్యుతాపురం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని, తప్పనిసరిగా మృతుల కుటుంబీకులతో మాట్లాడాలని ఆదేశించారు. అందుకు లారీ యజమాని అంగీకరించడంతో సాయంత్రం ఐదున్నరకు మృతుల బంధువులు ఆందోళనను విరమించారు.

Updated Date - Apr 12 , 2024 | 12:34 AM