Share News

దటీజ్‌ దిమిలి!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:43 AM

ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని దిమిలి గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి.

దటీజ్‌ దిమిలి!

ఒకే గ్రామం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

వీరిలో ఒకరు ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక

ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఎలమంచిలి నుంచి పప్పల బాపునాయుడు ప్రాతినిధ్యం

1967 ఎన్నికల్లో నగిరెడ్డి సత్యనారాయణ గెలుపు

1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయంసాధించిన పప్పల చలపతిరావు

2004లో అనకాపల్లి ఎంపీ, తరువాత శాసన మండలికి ఎన్నిక

టీటీడీ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా సేవలు

ఓటమి ఎరుగని నేతగా అరుదైన రికార్డ్‌ సొంతం

ఎలమంచిలి, ఏప్రిల్‌ 18:

ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని దిమిలి గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులకు ఇది పురిటిగడ్డ. ఈ గ్రామం నుంచి ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా, లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వీరిలో పప్పల చలపతిరావును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. మరోసారి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా రికార్డుల్లో నిలిచారు. వీరంతా కాంగ్రెసేతర పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం.

దిమిలి గ్రామానికి చెందిన పప్పల బాపునాయుడు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిృషికార్‌ లోక్‌ పార్టీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి మిస్సుల సూర్యనారాయణమూర్తిపై విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇదే గ్రామానికి చెందిన నగిరెడ్డి సత్యనారాయణ 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వీసం సన్యాసినాయుడుపై విజయం సాధించారు. సత్యనారాయణ 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి వీసం సన్యాసినాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా వున్నారు. దిమిలి గ్రామానికే చెందిన పప్పల చలపతిరావు పలు రికార్డులు సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో వున్న ఆయన వరుసగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ చైర్మన్‌గా, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. తరువాత ఆరేళ్లపాటు శాసనమండలి సభ్యునికి పనిచేశారు. బాపునాయుడు, చలపతిరావు, సత్యనారాయణ దగ్గర బంధువులు కావడం విశేషం. పప్పల చలపతిరావుకు బాపునాయుడు పెదనాన్న కాగా, సత్యనారాయణ మేనమామ అవుతారు.

స్వాతంత్య్ర సమరయోధులు

దిమిలి చెందిన ఎంతో మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. వీరిలో శిష్ట్లా రామదాస్‌, కళానాథభట్ల జగన్నాథచయనులు, శిష్ట్లా పురుషోత్తం, యల్లాయి అప్పలనరసింహం, శానాపతి అప్పలనాయుడు, నేమాని సత్యనారాయణ తదితరులు స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో వీరి పేర్లతో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 01:43 AM