Share News

ప్రభుత్వ భూమిలో దర్జాగా కోళ్లఫారాలు

ABN , Publish Date - May 30 , 2024 | 01:14 AM

మండలంలోని పైడివాడఅగ్రహారం రెవెన్యూ పరిధి పీతపాలెం గ్రామంలో ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి(డి పట్టా)లో దర్జాగా కోళ్లఫారం ఏర్పాటు చేసినా పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వ భూమిలో దర్జాగా కోళ్లఫారాలు
ఎడమ వైపు పాత కోళ్లఫారం, కుడివైపున కొత్తగా ఏర్పాటు చేసిన కోళ్లఫారం

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహణ

పట్టించుకోని అధికారులు

సబ్బవరం, మే 29: మండలంలోని పైడివాడఅగ్రహారం రెవెన్యూ పరిధి పీతపాలెం గ్రామంలో ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి(డి పట్టా)లో దర్జాగా కోళ్లఫారం ఏర్పాటు చేసినా పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు లంచాలు తీసుకుని ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

పైడివాడఅగ్రహారం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 2లో 28.14 ఎకరాల ప్రభుత్వ భూమిని 1987లో పీతపాలెం గ్రామానికి చెందిన సుమారు 14 మందికి ప్రభుత్వం డి పట్టా మంజూరు చేసింది. ఇందులో సర్వే నంబరు 2/1కెలో మడక దేముడు, అతని బంధువు మడక బొజ్జమకు సుమారు 2 ఎకరాల డి పట్టా భూమి ఉంది. రెండేళ్ల క్రితం మడక బొజ్జమకు చెందిన భూమిని మడక దేముడు కుమారుడు మడక సూరిబాబు కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో రెండేళ్లు క్రితం ఒక కోళ్లఫారం ఏర్పాటు చేశాడు. ఇటీవల మరో కోళ్లఫారం ఏర్పాటు చేశాడు. అయితే తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని మడక బొజ్జమ్మ ఏడాదిగా పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. గత నెల 24న బొజ్జమ కుమార్తె చంద్రిక సబ్బవరం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు స్పందించలేదని ఆమె వాపోయింది.

అనుమతులు లేకుండా నిర్వహణ

కోళ్లఫారం ఏర్పాటు చేయాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినట్టు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తరువాత గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్మానం పత్రం ఉండాలి. పొల్యూషన్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాలి. చనిపోయిన కోళ్లను పాతిపెట్టేందుకు గోతులు ఉండాలి. విద్యుత్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. భూగర్భ జల విభాగం నుంచి అనుమతి ఉండాలి. ఇటువంటివి ఏమీ లేకుండానే దర్జాగా, అది కూడా ప్రభుత్వ భూమిలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పీతపాలెంలో ఏర్పాటు చేసిన కోళ్లఫారాలకు ఎటువంటి పంచాయతీ తీర్మానం ఇవ్వలేదని కార్యదర్శి మహలక్ష్మీనాయుడు తెలిపారు. ప్రభుత్వ భూమిలో కోళ్లఫారం ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఆర్‌ఐ వీరయ్య తెలిపారు. ఎన్నికలు విధుల్లో ఉండగా కొత్త కోళ్లఫారం నిర్మించినట్టు తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి తొలగిస్తామని ఆర్‌ఐ చెప్పారు.

Updated Date - May 30 , 2024 | 01:14 AM