Share News

ఆదమరిస్తే అంతే!

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:14 AM

మండలంలో సముద్ర తీరంలో వున్న పూడిమడక పొగిరి ప్రాంతం ఎంత ఆహ్లాదకంగా, అందంగా ఉంటుందో.. అజాగ్రత్తగా వుంటే అంతే ప్రమాదకరంగా మారుతుంది.

ఆదమరిస్తే అంతే!

ప్రమాదకరంగా పూడిమడక పొగిరి ప్రాంతం

సముద్రంలో పోటు సమయంలో అలల ఉధృతి

అంచనా వేయలేక నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్న సందర్శకులు

రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్‌

అచ్యుతాపురం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):

మండలంలో సముద్ర తీరంలో వున్న పూడిమడక పొగిరి ప్రాంతం ఎంత ఆహ్లాదకంగా, అందంగా ఉంటుందో.. అజాగ్రత్తగా వుంటే అంతే ప్రమాదకరంగా మారుతుంది. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సరిహద్దులో వున్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయం. అదే విధంగా మృత్యుకుహరంగా కూడా పేరు పడింది. ఇక్కడ అలల ఉధృతిని అంచనా వేయలేక పలువురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం ఒకే కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పూడిమడక పొగిరి ప్రాంతంలో మృత్యువాతపడ్డారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల సరిహద్దుల్లో పూడిమడక పొగిరి ప్రాంతం ఉంది. రాంబిల్లి మండలం సీతపాలెం తీరంలో కొండ ఉంది. ఈ కొండ ఎక్కి చూస్తే మూడు వైపులా నీలి రంగు సముద్రం కనిపిస్తుంది. సూర్యోదయం సమయంలో చేపల వేటకు వెళ్లే పడవలు, సముద్రం గర్భాన్ని చీల్చుకుంటూ వస్తున్నట్టు కనిపించే భానుడు.. ఈ దృశ్యాలను తిలకించడానికి రెండు కళ్లూ చాలవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. తీరంలో కొండ వుండడంతో ఇక్కడ అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రోజుకి రెండుసార్లు ఆటు, పోట్లు వస్తుంటాయి. ఆటు సమయంలో సముద్రంలో అలల తాకిడి అంతగా లేకుండా చెరువులా కనిపిస్తుంది. పోటు సమయంలో ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక్కడ అలలు ఉవ్వెత్తున ఎగసి పడతాయి. కొండ పక్కన సముద్రంలో రాళ్లు వున్నాయి. ఇవి ఆటు సమయంలోనే కనిపిస్తాయి. పోటు సమయంలో కనిపించవు. ఈ విషయం స్థానిక మత్స్యకారులకు మాత్రమే తెలుసు.

ఇదిలావుండగా సీతపాలెం కొండ పక్క నుంచి పూడిమడకకు ఉప్పుటేరు వస్తుంది. ఇది పూడిమడక చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ కడపాలెం శివారు కొత్తేరులో కలుస్తుంది. అక్కడ నుంచి తిరిగి సముద్రంలో కలుస్తుంది. అయితే ఉప్పుటేరు ప్రారంభం అయిన దగ్గర చాలా ప్రమాదకరం పూడిమడక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి వచ్చిన తర్వాత పోటు సమయంలో పడవలను ఉప్పుటేరు గుండా తీసుకువచ్చి గ్రామానికి సమీపంలో లంగరు వేస్తారు. మళ్లీ మరుసటి రోజు పోటు సమయంలోనే ఉప్పుటేరు గుండా సముద్రంలోకి వెళతారు. అంటే సముద్రం పోటుగా సమయంలో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. పొగిరి వద్ద అలల ఉధృతి తీవ్రంగా ఉంటుంది. మత్స్యకారులే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ ప్రాంతం పూడిమడకకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. అయితే ఈ ప్రాంతం అందాల గురించి తెలుసుకున్న అనకాపల్లిలో ఒక కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు 2022 జూలై 29న ఇక్కడకు వచ్చారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఆకస్మికంగా వచ్చిన అలల ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత ఆ ప్రాంతానికి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పూడిమడక-లోవపాలెం రోడ్డు నుంచి తీరం వరకు సుమారు 50 అడుగుల వెడల్పున రోడ్డు వేశారు. దీంతో పొగిరి ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమైంది. ఆదివారం విశాఖలోని నాయుడుతోట ప్రాంతానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఇక్కడ విహారానికి వచ్చారు. వీరిలో అభిరామ్‌ అనే విద్యార్థి అలల తాకిడికి సముద్రంలో మునిగి మృతిచెందాడు. అత్యంత ప్రమాదకరమైన పొగిరి ప్రాంతం వద్ద అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడంతోపాటు ఎవరూ ఇక్కడ సముద్రంలో దిగకుండా చర్యలు చేట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 01:14 AM