Share News

బతుకులు కుదేలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:41 AM

భవన నిర్మాణ రంగ కార్మికులను ఎవరిని కదిపినా ఇదే రకమైన బాధను వ్యక్తం చేస్తున్నారు.

బతుకులు కుదేలు

అప్పుల్లో భవన నిర్మాణ రంగ కార్మికులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక విధానంలో మార్పులు

నాటి నుంచే ఇబ్బందులు ప్రారంభం

ధర పెరగడంతో పాటు తగినంత లభ్యంకాని పరిస్థితి

ఇటుక, స్టీల్‌, సిమెంట్‌ ధరలు కూడా భారీగా పెరగడంతో నిర్మాణాలు మందగమనం

కార్మికులకు తగ్గిన పనులు

వారంలో కనీసం రెండు రోజులు కూడా పని దొరకడం లేదని ఆవేదన

అప్పులు చేసి జీవనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పదిహేనేళ్ల నుంచి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఐదేళ్ల నుంచి పనుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వారంలో రెండు, మూడు రోజులు కూడా పని దొరకడం లేదు. ఇటుక, ఇసుక ధరలు పెరిగిపోవడం, ఇతర ఇబ్బందులతో నిర్మాణ రంగం కుదేలైపోయింది. అదే మా పాలిట శాపంగా మారింది. కొత్తగా తెచ్చిన ఇసుక విధానం, ఆ తరువాత వచ్చిన కరోనా భవన నిర్మాణ రంగంలోని కార్మికుల జీవితాలను అధఃపాతాళానికి తొక్కేశాయి.

-వెంకోజీపాలెం ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సత్తెయ్య ఆవేదన.

భవన నిర్మాణ రంగ కార్మికులను ఎవరిని కదిపినా ఇదే రకమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన విధానం పేరుతో ఇసుక సరఫరాలో మార్పులు తెచ్చింది. దీంతో ధర భారీగా పెరిగిపోయింది. అంతేకాకుండా నిర్మాణాలకు తగినంత స్థాయిలో ఇసుక లభించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో వారంలో కనీసం ఐదు రోజులు పని దొరికేదని, గడిచిన ఐదేళ్ల నుంచి కనీసం రెండు రోజులు కూడా పని దొరకడం కష్టంగా మారిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఇదే రంగంలో పనిచేస్తున్న తాను...ఇటువంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి మహాలక్ష్మి చెప్పింది. పనులు దొరక్కపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని, అప్పులు చేసి మరీ బతుకులు ఈడుస్తున్నామని ఆమె వాపోయింది.

వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు

విశాఖ నగర పరిధిలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి లక్ష మందికిపైగా కార్మికులు ఉన్నారు. వీరంతా కూలీలు, తాపీమేస్ర్తీలు, పరంజీ మేస్ర్తీలుగా, సెంట్రింగ్‌ వర్క్‌, టైల్స్‌, వుడ్‌ వర్క్‌ వంటి పనులు చేస్తుంటారు. వీరు చేసే పనిని బట్టి మహిళలకు రోజుకు రూ.500, పురుషులకు అయితే రూ.700 నుంచి రూ.వేయి వరకు చెల్లిస్తుంటారు. వీరంతా వెంకోజీపాలెం, ఆరిలోవ, ఇసుకతోట, మద్దిలపాలెం, సీతమ్మధార, సీతంపేట, ఎన్‌ఏడీ, అక్కయ్యపాలెం, గాజువాక తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటారు. తాము నివాసం ఉండే ప్రాంతాలకు దగ్గరలోని ప్రధాన కూడళ్ల వద్దకు ఉదయాన్నే క్యారేజీలు పట్టుకుని వెళ్లి నిల్చుంటారు. అక్కడకు వర్కర్‌ మేస్ర్తీలు, నిర్మాణ పనులు చేసుకునే కాంట్రాక్టర్లు వచ్చి రోజు కూలీ ప్రాతిపదికన వీరిని తీసుకుని వెళుతుంటారు.

నిలిచిన నిర్మాణాలతో ఇబ్బందులు..

గతంలో నిర్మాణ పనులు చేసే వారికి ఎంత కావాలంటే అంత ఇసుక లభించేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక విధానంలో మార్పులు చేసింది. దీంతో ఇసుక లభ్యత తగ్గిపోయింది. ఇసుక కొనుగోలు చేయడం నిర్మాణదారులకు కత్తి మీద సాములా మారింది. అదే సమయంలో ఇసుక, ఇటుక ధర కూడా భారీగా పెరిగిపోవడంతో పనులు మందగించాయి. గతంలో ఆటో ఇసుక రూ.500 ఉంటే, ఇప్పుడు రూ.2,000, రూ.3,000 వరకూ వసూలు చేస్తున్నారని, అలాగే ఇటుక గతంలో మూడు రూపాయలు ఉంటే, ప్రస్తుతం అది రూ.10 అయ్యిందని, దీంతో పనులు తగ్గాయని కార్మికులు వాపోతున్నారు. వీటితోపాటు పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలు కూడా నిర్మాణ రంగంలోని పనులపై ప్రభావం చూపించాయని, దీంతో తమకు పనులు దొరకకుండా పోయాయని విజయనగరం నుంచి వచ్చి ఆరిలోవలో నివాసం ఉంటున్న రాజారావు అనే తాపీమేస్ర్తీ ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పులు చేసి జీవనం

గతంలో ఇంటి నుంచి క్యారేజీ పట్టుకుని రోడ్డెక్కితే పని దొరికేదని, ఎప్పుడో నెలలో ఒకటి, రెండుసార్లు పనుల్లేక ఇంటికి వెళ్లేవాళ్లమని, కానీ, గడిచిన కొన్నాళ్ల నుంచి వారంలో ఒకటి, రెండు రోజులు పని దొరకడం కష్టంగా మారుతోందని లక్ష్మణ్‌ అనే సెంట్రింగ్‌ వర్కర్‌ వాపోయాడు. ప్రతిరోజూ క్యారేజీ పట్టుకుని వెళ్లడం, పని దొరక్క ఉసూరుమంటూ రావడం జరుగుతోందన్నాడు. పనులు దొరక్క చాలామంది స్వగ్రామాలకు వెళ్లిపోయారని, ఉన్న వాళ్లలో కూడా ఎంతోమంది ప్రత్యామ్నాయ పనులు చూసుకుంటున్నారని రాజు అనే భవన నిర్మాణ కార్మికుడు వాపోయాడు. గతంలో తనతోపాటు భార్య కూడా పనికి వచ్చేదని, ఇప్పుడు రోజూ ఇసుకతోట జంక్షన్‌కు రావడం, పని లేకుండా వెనక్కి వెళ్లడం జరుగుతోందని, దాంతో రెండు నెలల కిందట ఓ ఇంటిలో పనికి కుదిరిందని వెల్లడించాడు. తనకు పని దొరకకపోయినా ఆమెకు వచ్చే డబ్బుతో ఇంటిని నడుపుతున్నామని, ఇతర ఖర్చులకు అప్పులు చేస్తున్నామని వాపోయాడు.

పెరిగిన ఖర్చులు

నెలంతా పని దొరికితేనే ఇంటిని నడపడం కష్టంగా ఉండేదని, అటువంటిది ఇప్పుడు వారానికి రెండు రోజులు కూడా పని దొరకకపోవడంతో అప్పులు చేస్తున్నామని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. కొందరు కుటుంబ పోషణ కోసం రాత్రివేళల్లో వాచ్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా చేరుతున్నారు. పెరిగిన ఇంటి అద్దెలు, కరెంట్‌ చార్జీలు, నిత్యావసర సరకుల ధరలతో నెలకు కనీసం రూ.15 వేలు అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు కావాల్సి వస్తోందని, పనుల్లేకపోవడంతో కనీసం పది వేలైనా అప్పు చేయాల్సి వస్తోందని రామారావు అనే కూలీ వాపోయాడు. పిల్లలు చదువులకు, ఇతర ఖర్చులకు అప్పులు చేస్తున్నామని, గడిచిన మూడేళ్లలో రూ.2 లక్షలు అప్పు చేశానని వాపోయాడు.

15 రోజుల నుంచి పని దొరకలేదు

- బి.లక్ష్మి, రోజు కూలీ

మాది విజయనగరం జిల్లా పోరాం గ్రామం. పదిహేనేళ్ల కిందట వైజాగ్‌ వచ్చేశాం. భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గడిచిన కొన్నాళ్ల నుంచి పనులు చేద్దామన్నా దొరకడం లేదు. గత 15 రోజులుగా క్యారేజీ పట్టుకుని రావడం, వెళ్లడం...ఒక్కరోజైనా పని దొరకకపోతుందా అనే ఆశతో ఆరిలోవ నుంచి రోజుకు రూ.40 చార్జీలు పెట్టుకుని వస్తున్నా. చార్జీలు ఖర్చు తప్ప పని లేదు. ఒక్కరోజు పని దొరికినా రూ.500 వస్తుందన్న ఆశ. పనుల్లేకపోవడంతో ఇంటి ఖర్చులకు ఇబ్బంది అవుతోంది. మా ఇంటాయనకు కూడా పని దొరకడం లేదు. ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం ఊళ్లో తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.

కుటుంబ పోషణ కష్టమవుతోంది

- కె.కమలమ్మ, రోజువారీ కూలీ

మాది శ్రీకాకుళం జిల్లా మరువాడ. ఇరవై ఏళ్ల కిందట నగరానికి వచ్చేశాం. మా ఇంటాయనతో కలిసి భవన నిర్మాణ పనులకు వెళుతుండేదాన్ని. గత కొన్నాళ్ల నుంచి పనులు దొరకడం లేదు. ప్రతిరోజూ కామత్‌ హోటల్‌ దగ్గర నుంచి చార్జీ పెట్టుకుని ఇసుకతోట జంక్షన్‌కు రావడం, పనులు దొరకపోవడంతో మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం.. ఇదే తంతు. పనులు లేకపోవడంతో మా ఇంటాయన వాచ్‌మన్‌గా చేరిపోయాడు. ఉండడానికి చిన్న గది ఇచ్చారు. దీంతో అద్దె, కరెంట్‌ బిల్లు వంటి ఖర్చులు తప్పాయి. నెలకు కొంత ఆదాయం వస్తోంది. కానీ, ఇతర ఖర్చులకు అప్పులు చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందో అర్థం కావడం లేదు.

ఈ ఇబ్బందులు ఇంకెన్నాళ్లో

- బొంగు రఘుపతినాయుడు, తాపీమేస్ర్తీ

మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. పదేళ్ల కిందట కుటుంబంతో సహా వైజాగ్‌ వచ్చేశాను. అప్పట్లోనే డిగ్రీ పూర్తిచేశాను. ఉద్యోగం రాకపోవడంతో తాపీ పనిలో చేరిపోయాను. గతంలో నెలకు 20 రోజులకుపైగా పని దొరికేది. గత కొన్నాళ్ల నుంచి రెండు, మూడు రోజులు కూడా దొరకడం లేదు. అసలు పనికి పిలిచే వారు కరువైపోయారు. సాధారణంగా తాపీమేస్ర్తీకి వేయి ఇస్తారు. రూ.700 ఇచ్చినా వస్తామన్నా ఎవరూ పిలవడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాం. బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు వాడేశాను. ఇప్పుడు వడ్డీకి తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. దేవుడి మాన్యం పండిస్తున్నా. ఆ బియ్యం వండుకుని తింటున్నాం. ఇతర ఖర్చులకు అప్పులు చేస్తున్నా. ఇంకా ఎన్నాళ్లు ఈ ఇబ్బందులు ఉంటాయో అర్థం కావడం లేదు.

Updated Date - Apr 19 , 2024 | 01:41 AM