Share News

కన్నీటి సాగు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:22 AM

జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది కొంతకాలం వర్షాభావ పరిస్థితులు, మరికొంతకాలం అధిక వర్షాల వల్ల అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. ఆయా సమయాల్లో పంట పండదేమోనని, పండిన పంట చేతికి దక్కదేమోనని ఆందోళన చెందారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో దాదాపు మూడు వారాలపాటు అల్పపీడనాలు, వాయుగుండాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ధాన్యం దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని గుబులు చెందారు.

కన్నీటి సాగు!
కె.కోటపాడు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నేలవాలిన వరిపైరు

ఏడాదంతా అన్నదాతలకు కష్టాలే

ఒడిదుడుకుల్లో వరి సాగు

ఆరంభంలో వర్షాభావం.. అనంతరం తెగుళ్లు దాడి

పంట చేతికొచ్చే సమయంలో ముసురు

పండిన పంటను కాపాడుకోవడానికి అష్టకష్టాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది కొంతకాలం వర్షాభావ పరిస్థితులు, మరికొంతకాలం అధిక వర్షాల వల్ల అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. ఆయా సమయాల్లో పంట పండదేమోనని, పండిన పంట చేతికి దక్కదేమోనని ఆందోళన చెందారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో దాదాపు మూడు వారాలపాటు అల్పపీడనాలు, వాయుగుండాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ధాన్యం దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని గుబులు చెందారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి పంటల సాగు తీవ్ర ఒడిదుడులకు లోనైంది. జూన్‌, జూలై నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వరి నాట్లు ఆలస్యం అయ్యాయ. చెరకు మొక్క తోటలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆగస్టులో వర్షాలు సంతృప్తికరంగా కురవడంతో కొంత ఆలస్యం అయినప్పటికీ వరినాట్లు పూర్తిచేశారు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరి పైరు నీట మునిగింది. 662.32 హెక్టార్ల వరి పైరు దెబ్బతినడంతో కూటమి ప్రభుత్వం 2,846 మంది రైతులకు రూ.1.65 కోట్ల నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందజేసింది. తరువాత పలు రకాల తెగుళ్లు ఆశించడంతో వీటి నివారణకు రైతులు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. చీడపీడల కారణంగా కొంత పంట నష్టపోవడమే కాకుండా, పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. ఇక పంట పండి, కోతకు వచ్చిన దశలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాలు, వాయుగుండాలు, ఒకసారి తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిశాయి. దీనివల్ల కోత కోసిన వరి పనలు తడిపోయాయి. వరి కోతలు వాయిదా వేసుకోవాల్సి రావడంతో ధాన్యం కొంతమేర రాలిపోయింది. ఒకానొక దశలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో వరి పంటపై ఆశలు వదుకోవాల్సిందేనా అని రైతులు ఆందోళన చెందారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటను కాపాడుకోవడానికి వరి పనలు పూర్తిగా ఆరకుండానే కుప్పలు వేసుకోవాల్సి వచ్చింది. వాతావరణం తెరపిచ్చినప్పుడు రైతులంతా ఒకేసారి వరి కోతలు, కుప్పల పనులు చేపట్టడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో సాధారణం కన్నా ఎక్కువ కూలి చెల్లించాల్సి వచ్చింది.

ఐదేళ్లలో సగానికి తగ్గిన చెరకు సాగు

జిల్లాలో రెండో ప్రధాన పంట చెరకు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు జిల్లాలో వున్న నాలుగు సహకార చక్కెక కర్మాగారాల్లో మూడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వీటిని తెరిపించడానికి కనీస ప్రయత్నాలు చేయలేదు. దీంతో చెరకు రైతులు వేరే పంటలను సాగుచేయడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ఐదేళ్ల క్రితం జిల్లాలో 40 వేల హెక్టార్లకుపైగా చెరకు సాగు చేసేవారు. ఈ ఏడాది 19,800 హెక్టార్లకు పడిపోయింది.

నీటి వనరులు అస్తవ్యస్తం

జిల్లాలో సాగునీటి వనరులను గత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఒక్కటంటే ఒక్క జలాశయాన్ని కూడా ఆధునీకరించేందుకు నిధులు కేటాయించలేదు. పంట కాలువల్లో వార్షిక నిర్వహణ పనులకు సైతం నిధులు విడుదల చేయలేదు. దీంతో కాలువల్లో పూడిక పేరుకుపోయి, తుప్పలు బలిసిపోయి ఆయకట్టుకు నీరు సక్రమంగా అందని దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. జిల్లాకు జీవనాడి అయిన పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొనడమే తప్ప ఒక్క ఏడాది కూడా వాటిని విడుదల చేసిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ఎడమ కాలువ పనులకు నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇటీవల టెండర్లు కూడా పిలిచింది.

Updated Date - Dec 28 , 2024 | 12:22 AM