Share News

సీఎస్‌ఈనే...

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:20 AM

ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లో సంక్షోభం ఉన్నప్పటికీ మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపులోనే చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.

సీఎస్‌ఈనే...

  • కంప్యూటర్‌ సైన్స్‌కు కొనసాగుతున్న డిమాండ్‌

  • నగరంలో పేరొందిన రెండు ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీటు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు

  • మరో రెండింటిలో రూ.మూడు, నాలు లక్షలు

  • పొరుగు జిల్లా కళాశాలలో రూ.5 లక్షలు

  • వీటికి ఫీజులు అదనం

  • ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

  • ఏయూలోని రెండు కళాశాలల్లో 900 ఇంజనీరింగ్‌ సీట్లు

  • 21 ప్రైవేటు కళాశాలలలో 17,190

    విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):

ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లో సంక్షోభం ఉన్నప్పటికీ మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపులోనే చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. లక్షలు పోసైనా పేరున్న కళాశాలలో సీటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారు. నగర శివారుల్లోని రెండు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కావాలంటే రూ.ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకూ చెల్లించాలి. మరో రెండు కళాశాలలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు చెబుతున్నాయి. పొరుగు జిల్లాలో మరో కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు రూ.ఐదు లక్షలు పలుకుతుంది.

రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన ఈఏపీసెట్‌ (ఎంసెట్‌)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ ప్రారంభమైంది. టాపర్లు పలువురు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్స్‌లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి ఉంటారు. అటువంటి వారంతా ఐఐటీ/ఎన్‌ఐటీ/తత్సమాన జాతీయ విద్యాసంస్థల్లో చేరతారు. అక్కడ సీట్లు రాని విద్యార్థులు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల, నగర శివారుల్లోని నాలుగు, పొరుగు జిల్లాలోని ఒక ప్రైవేటు కళాశాలలో ప్రవేశాలకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కూడా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఏయూలో కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీల్లో సీటు రాకపోతే ప్రముఖ ప్రైవేటు కళాశాలలో అదే కోర్సులో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మెరుగైన ర్యాంకులు రాని విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం యత్నిస్తున్నారు. ఆర్థికంగా స్థోమత కలిగినవారు లక్షల రూపాయలు పోసి సీట్లు కొంటున్నారు. నగర శివారుల్లోని రెండు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కావాలంటే తొలుత ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు కట్టాలి. ఆ తరువాత ఏటా రూ.2.25 లక్షల చొప్పున నాలుగేళ్లలో మరో రూ.తొమ్మిది లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షలు అవుతుంది. దానికి పుస్తకాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు అదనం. మరో రెండు కళాశాలల్లో డొనేషన్లు, నాలుగేళ్ల ఫీజు కలిపి రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షలు అవుతుందని గాజువాకకు చెందిన దాసరి సురేంద్ర అనే పేరెంట్‌ వెల్లడించారు. పొరుగు జిల్లాలో ప్రముఖ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో సీటుకు రెండు లక్షలు డొనేషన్‌ చెల్లించామని తగరపువలసకు చెందిన వెంకట్‌ అనే పేరెంట్‌ వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకుని సీట్లు కేటాయించాలన్న నిబంధనను ఏ ఒక్క కళాళాల యాజమాన్యం పాటించడం లేదని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా మిగిలిన బ్రాంచీలకు పెద్దగా డిమాండ్‌ ఉండడం లేదు. ఏయూలో మాత్రం కంప్యూటర్‌ సైన్స్‌ తరువాత మిగిలిన బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా ఇతర బ్రాంచీల విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగంలో ఉద్యోగం పొందాలంటే కంప్యూటర్‌ సంబంధిత కోర్సులు చేయాల్సిందేనని ఐటీ కన్సల్టెంట్‌ నిపుణుడు నరసింహరావు వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలోనే భారీ ఉద్యోగాలు ఉన్నందున ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరుతున్నారని, ఈ ట్రెండ్‌ రెండున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతుందన్నారు. గడచిన రెండు, మూడేళ్ల నుంచి కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌ కోర్సులు వచ్చాయన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్‌ సీట్లు 18,090

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌, మహిళా కళాశాలల్లో కలిపి 900 సీట్లు, 21 ప్రైవేటు కళాశాలల్లో 17,190 సీట్లు...మొత్తం 23 కళాశాలల్లో 18,090 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐటీలో 60 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది.

ఎక్కువ ఉద్యోగాలతోనే కంప్యూటర్‌ సైన్స్‌పై ఆసక్తి

ఆచార్య వెంకటరావు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి, ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల

ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. పేరున్న కళాశాలల్లో సీటు కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఐటీలో కొంత స్లంప్‌ ఉన్నా...ఇప్పటికీ ఈ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు దొరుతుతున్నాయి. తొలుత తక్కువ ప్యాకేజీతో చేరినా తరువాత అనుభవం, కొత్త కోర్సులు నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటోంది. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు కొత్త అంశాలను నేర్చుకునే దిశగా ప్రయత్నించి పోటీతత్వం అలవర్చుకుంటే బ్రాంచి ఏదైనా ఫర్వాలేదు.

Updated Date - Jul 05 , 2024 | 01:20 AM