కిక్కిరిసిన రైళ్లు
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:59 AM
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు స్వస్థలాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం
సికింద్రాబాద్, చైన్నై, బెంగళూరు రైళ్లకు డిమాండ్
చాలా రైళ్లలో ఈ నెల 26 వరకూ బెర్తులు లభించని పరిస్థితి
బెంగళూరు రైళ్లు వచ్చే నెల 13 వరకూ ఫుల్
విశాఖపట్నం, జనవరి 17:
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు స్వస్థలాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బెర్త్ రిజర్వేషన్ చేయించుకోనివారు...జనరల్ కోచ్‌లలో సీట్ల కోసం రైలు బయలుదేరడానికి గంట ముందుగానే స్టేషన్‌కు చేరడంతో బుధవారం ప్లాట్‌ఫామ్‌లు కిటకిటలాడాయి. జనరల్ టికెట్ ప్రయాణికులు కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానా చెల్లించేందుకు సిద్ధపడి రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805), సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240), మధ్యాహ్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717), మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12839), ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463), తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆశ్రయించారు.
సికింద్రాబాద్ రైళ్లకు డిమాండ్
పండుగ తిరుగు ప్రయాణికులతో సికింద్రాబాద్, హైదరాబాద్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. విశాఖ నుంచి బయలుదేరే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), విశాఖ-మహబూబ్‌నగర్ (12861), ఎల్‌టీటీ (18519), విశాఖ-నాందేడ్ (20811), గరీబ్‌రధ్ (12739), వందేభారత్ (20833), జన్మభూమి (12805), దురంతో (22203), విశాఖ-కాచీగూడ (18561), విశాఖ-కర్నూలు ప్రత్యేక రైలు (08541), విశాఖ-సికింద్రాబాద్ స్పెషల్ (08579) వంటి ఒరిజినేటింగ్ రైళ్లతోపాటు విశాఖ (17015), కోణార్క్ (11020), ఫలక్‌నూమా (12703), సంబల్‌పూర్-నాందేడు ఎక్స్‌ప్రెస్ (20809)లు కిక్కిరిశాయి. ఈ రైళ్లలో ఈనెల 26వ తేదీ వరకు బెర్తులు రిజర్వు అయిపోయాయి. కాగా, వందేభారత్‌కు ఈనెల 23వ తేదీ నుంచి సీట్లు ఖాళీ ఉండగా, 24న విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక వారాంతపు రైలు (08579)కు, 24, 25 తేదీల్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు, 25న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు, 26న విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
చెన్నై రైళ్ల పరిస్థితి ఇదీ..
చెన్నై రైళ్లలో ఈ నెలాఖరు వరకూ బెర్తులు నిండిపోయాయి. మెయిల్ (12839), బొకారో (13351), కోరమాండల్ (12841) వంటి రెగ్యులర్ రైళ్లతోపాటు విశాఖ-చెన్నై ఎక్స్‌ప్రెస్ (22801), హౌరా-కన్యాకుమారి (12665), భువనేశ్వర్-పాండిచ్చేరి (12898), భువనేశ్వర్-చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12830), టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189), షాలిమార్-చెన్నై ఎక్స్‌ప్రెస్ (22825) రైళ్లకు నిరీక్షణ జాబితా నెలకొంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు (12841) ఈనెల 26వ తేదీన ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరు రైళ్లు
బెంగళూరు వెళ్లే రైళ్లలో వచ్చే నెల (ఫిబ్రవరి) 13వ తేదీ వరకు బెర్తులు ఫుల్ అయిపోయాయి. ప్రశాంతి (18463), హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12863) తదితర రెగ్యులర్ రైళ్లతోపాటు ప్రతి ఆదివారం నడిచే విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు (08543), హౌరా-బెంగళూరు దురంతో (12245), అగర్తాల-బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (12504), హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12835), గుహవటి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12510), భగల్‌పూర్-బెంగళూరు అంగా ఎక్స్‌ప్రెస్ (12254), అగర్తాల-బెంగళూరు హంసఫర్ (12504), కామాఖ్య-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12552), పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్‌రధ్ (22833), టాటా-యశ్వంత్‌పూర్ (18111), జసిదిన్ జంక్షన్-బెంగళూరు (22306) ఎక్స్‌ప్రెస్‌లలో బెర్తులు ముందే రిజర్వు అయిపోయాయి. టాటా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12889), హౌరా-మైసూర్ ఎక్స్‌ప్రెస్ (22817), భువనేశ్వర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845), హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (18637), న్యూ టిన్సుకియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (22502), హౌరా-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్ (22863), ముజాఫర్‌పూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (15228) రైళ్లలో కూడా బెర్తులు అందుబాటులో లేవు. కాగా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 31వ తేదీన ఆర్‌ఏసీలో సీటు లభిస్తుండగా, తర్వాత రోజుల్లో నిరీక్షణ జాబితా నెలకొంది.