Share News

అడ్డగోలుగా చేపల చెరువులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:08 AM

మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో చేపల చెరువులను ఏర్పాటు చేశారు. పంట కాలువల నుంచి అక్రమంగా చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు చేపలకు ఆహారంగా చికెన్‌ వ్యర్థాలను వేస్తున్నారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతున్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

అడ్డగోలుగా చేపల చెరువులు
చేపల చెరువులో తేలియాడుతున్న బ్రాయిలర్‌ కోళ్ల వ్యర్ధాలు

రైతుల నుంచి వ్యవసాయ భూములు కౌలుకు

అనుమతులు లేకుండా పంట పొలాల్లో చెరువులు తవ్వకం

పంట కాలువల నుంచి నీరు మళ్లింపు

చేపలకు ఆహారంగా మాంసం వ్యర్థాలు

చేపలు పట్టిన తరువాత వాగుల్లోకి వ్యర్థ జలాలు విడుదల

స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

దేవరాపల్లి, ఫిబ్రవరి 27: మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో చేపల చెరువులను ఏర్పాటు చేశారు. పంట కాలువల నుంచి అక్రమంగా చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు చేపలకు ఆహారంగా చికెన్‌ వ్యర్థాలను వేస్తున్నారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతున్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చాలంటే నిబంధనల ప్రకారం పలు ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేసుకోవాలి. తొలుత ఆయా భూములను అధికారులు సందర్శించాలి. నీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? చేపల పట్టుబడి అనంతరం చెరువును ఖాళీ చేయడానికి వ్యర్థ జలాలను బయటకు ఎలా పంపుతారు? ఆ నీటి వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం వుందా? తదితర విషయాలను పరిశీలించాలి. అనంతరం పరిసర గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. అందరి ఆమోదం పొందినట్టు తీర్మానం చేయాలి. దీనిని మత్స్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్‌ ఆమోదం కోసం పంపాలి. అనంతరం చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. కానీ దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎటువంటి నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా పంట భూములను చేపల చెరువులుగా మార్చేశారు. చేపల వ్యాపారానికి విశాఖ నగరం ప్రధాన మార్కెట్‌ కావడంతో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు చేపల పెంపకందారులు దేవరాపల్లి మండలంలోని కొత్తపెంట, ఎం.అలమండ, తారువ, తామరబ్బ, చేనులపాలెం, ఎన్‌.గజపతినగరం, మారేపల్లి, కలిగొట్ల, ములకలాపల్లి, పెదనందిపల్లి, బి.కింతాడ, తదితర గ్రామాల్లోని వ్యవసాయ భూములను గోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది చేపల పెంపకందారులు లీజుకు తీసుకున్నారు. ఏటా ఎకరాకు రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తుంటారు. చేపల పెంపకందారులు రైవాడ కాలువల నుంచి నీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను వాగులు, గెడ్డల్లోకి విడిచి పెడుతున్నారు. చేపల చెరువుల వల్ల తమ పంట పొలాలు పాడైపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేపల ఆహారంగా చికెన్‌ వ్యర్థాలు

చేపలు త్వరగా పెరగడానికి, మేత ఖర్చు తగ్గించుకోవడానికి చెరువుల నిర్వాహకులు బ్రాయిలర్‌ కోళ్ల (చికెన్‌) వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, చోడవరం, కొత్తవలస, తదితర ప్రాంతాల్లోని చికెన్‌ షాపుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంకా వారపు సంతల్లో చౌకగా లభించే పశు మాంసం కూడా తీసుకువస్తున్నారు. రాత్రి వేళల్లో వీటిని ఉడబెట్టి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అనుమతులు లేకుండా పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడం, హానికరమైన వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడం, పంట కాలువల నుంచి చేపల చెరువులకు అక్రమంగా నీటిని మళ్లించడం, చేపలు పట్టిన అనంతరం వ్యర్థ జలాలను వాగులు, గెడ్డల్లోకి విడుదల చేయడంపై సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 01:08 AM