Share News

హద్దు దాటిన అటవీ సిబ్బంది

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:20 PM

జాతీయ రహదారి నిర్మాణానికి రిజర్వు ఫారెస్టులో కేటాయించిన అలైన్‌మెంట్‌ను(హద్దు) దాటి అటవీశాఖ సిబ్బంది భారీ వృక్షాలను నేలకూల్చారు. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ ప్రారంభమైంది.

హద్దు దాటిన అటవీ సిబ్బంది
చింతాలమ్మఘాట్‌లో విచారణ చేపడుతున్న స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరం

జాతీయ రహదారి నిర్మాణం పేరిట రిజర్వు ఫారెస్టులో భారీ వృక్షాల నరికివేత

కొయ్యూరు అటవీ సెక్షన్‌ సిబ్బంది ప్రమేయంపై విమర్శలు

అలైన్‌మెంట్‌ దాటి చెట్ల కూల్చివేతపై అటవీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

స్క్వాడ్‌ డీఎఫ్‌వోను విచారణాధికారిగా నియమించిన సీసీఎఫ్‌

విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేసిన వైనం

కొయ్యూరు, మార్చి 4: జాతీయ రహదారి నిర్మాణానికి రిజర్వు ఫారెస్టులో కేటాయించిన అలైన్‌మెంట్‌ను(హద్దు) దాటి అటవీశాఖ సిబ్బంది భారీ వృక్షాలను నేలకూల్చారు. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి అరకు వెళ్లే జాతీయ రహదారి 516-ఈ నిర్మాణానికి గాను కృష్ణాదేవిపేట- కొయ్యూరు ప్రఽధాన రహదారి మధ్యలో రావణాపల్లి దాటాక గల చింతాలమ్మఘాట్‌ రోడ్డు(ఏడొంపుల ఘాట్‌)లో అవసరమైన అడవి తొలగించేందుకు సంవత్సరం క్రితం కృష్ణాదేవిపేట, కొయ్యూరు అటవీ సెక్షన్‌లకు సంబంధించిన సిబ్బంది ట్రీ ఎన్యూమరేషన్‌(గణన) చేసి నివేదికలు ఇచ్చారు. ఎన్యూమరేషన్‌లో గుర్తించిన అడవిని తొలగించేందుకు గత అక్టోబరులో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాటిలో సుమారు రూ.18 లక్షల మేర నిధులు ఖర్చు చేసి నవంబరు నుంచి ఘాట్‌ రోడ్డులో రహదారి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లు తొలగించే చర్యలను కొయ్యూరు అటవీ సెక్షన్‌ సిబ్బంది చేపట్టారు. అధికారులు ఘాట్‌రోడ్డులో ఏ మేరకు రిజర్వు ఫారెస్టు అవసరమో గుర్తించి ఆ మేరకు అలైౖన్‌మెంట్‌ చేశారు. దీనిలో ఉన్న చెట్లు మాత్రమే అటవీ సిబ్బంది గుర్తించి అప్పట్లో నివేదించారు. అయితే పనులు చేపట్టిన అనంతరం అలైన్‌మెంట్‌లో చేసిన ఎన్యూమరేషన్‌ను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా స్వలాభాపేక్షతో రిజర్వు ఫారెస్టులోని చెట్లు నేలకూల్చారు.

విచారణ ప్రారంభం

ఘాట్‌ రోడ్డులో కుడివైపున గల అడవి బొయింతి రిజర్వు ఫారెస్టులో బంగారమ్మపేట బీటుకు సంబంధించి 1,355 కంపార్టుమెంట్‌ కృష్ణాదేవిపేట రేంజ్‌ పరిధికి చెందుతుంది. ఎడమ వైపు సరుగుడు రిజర్వు ఫారెస్టు లో కొయ్యూరు అటవీ సెక్షన్‌ బంగారమ్మపేట బీటులో 1,267 కంపార్టుమెంట్‌కు చెందుతుంది. వీటిలో బంగారమ్మ బీటులో 59 చెట్లు, సరుగుడు రిజర్వు ఫారెస్టులో 29 చెట్లను అదనంగా నేలకూల్చారు. అయితే చెట్ల తొలగింపునకు అయ్యే ఖర్చుకు సంబంధించి ప్రభుత్వానికి పంపిన నివేదిక మేరకు డ్రా చేసిన రూ.18 లక్షలకు, జాతీయ రహదారి నిర్మాణానికి వీలుగా ఘాట్‌లో చెట్లు తొలగించి డిపోనకు తరలించిన కలపకు వ్యత్యాసం ఉండడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రిజర్వు ఫారెస్టులో చెట్లు తొలగించారని సిబ్బంది అంటున్నారు. అయితే ఈ విషయంలో కొయ్యూరు అటవీ సెక్షన్‌కు సంబంధించిన సిబ్బంది జాతీయ రహదారి నిర్మాణం పేరుతో రిజర్వు ఫారెస్టులో విలువైన చెట్లను నరికించి వాటిని పక్కదారి పట్టించారనే వాదన బలంగా వినిపిస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణకు మూడు జిల్లాలకు చెందిన స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరంను చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (సీసీఎఫ్‌) నియమించారు. దీంతో సోమసుందరం తన సిబ్బందితో శనివారం, ఆదివారం ఘాట్‌రోడ్డు రిజర్వు ఫారెస్టులో తొలగించిన చెట్ల మొదళ్లను గుర్తించి వాటికి సంబంధించిన కలప కాకరపాడు అటవీ డిపోలో ఉన్నదీ, లేనిదీ పరిశీలించారు. అలాగే జాతీయ రహదారి నిర్మాణానికి వీలుగా కేటాయించిన రిజర్వు ఫారెస్టులో తొలగించిన చెట్లకు అయిన ఖర్చు, వాటికి సంబంధించిన కలప తదితర విషయాలపై పరిశీలన జరిపారు. ఈ విషయమై స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరంను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రతించగా ప్రభుత్వం నుంచి తీసుకున్న నిధులకు సంబంధించి ఖర్చు చూపేందుకు గాను హద్దు దాటారని, తాము రిజర్వు ఫారెస్టులో పరిశీలించిన 29 మొదళ్ల మేరకు కలప డిపోలో ఉందన్నారు. అయినప్పటికీ రిజర్వు ఫారెస్టులో చెట్లు నరికించడం చట్టరీత్యా నేరమని, దీనికి సంబంధించి సీసీఎఫ్‌కు నివేదిక ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 11:20 PM