Share News

కుర్చీలు వదలని వైసీపీ నేతలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:02 AM

వైసీపీ నాయకులకు ఇంకా అధికార దాహం తీరలేదు.

కుర్చీలు వదలని వైసీపీ నేతలు

పార్టీ ఓటమి పాలైనా నామినేటెడ్‌ పదవులకు రాజీనామా చేయని వైనం

ఈ జాబితాలో ఏపీ మేరీటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ సనపల చంద్రమౌళి, పీసీపీఐఆర్‌ చైర్మన్‌ చొక్కాకుల వెంకటరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండా రాజీవ్‌...

ఇంకా వర్సిటీల డైరెక్టర్లు, దేవస్థానాల ట్రస్ట్‌ బోర్డు సభ్యుల

అవే రద్దు అయిపోతాయంటూ వ్యాఖ్యలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ నాయకులకు ఇంకా అధికార దాహం తీరలేదు. సాధారణ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయినా నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారు రాజీనామా చేయలేదు. ప్రభుత్వమే రద్దు చేస్తుందని, తాము ప్రత్యేకంగా రాజీనామా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవులను పెద్దఎత్తున కట్టబెట్టింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి దగ్గర నుంచి ఓ మోస్తరు నాయకులంతా పైరవీలు చేసి పదవులు సంపాదించుకున్నారు. కొందరికి మంచి ఆదాయం సమకూరే పదవులే ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. మొదట ద్రోణంరాజు శ్రీనివాస్‌కి ఇచ్చారు. ఆ తరువాత తూర్పు నియోజకవర్గ నాయకురాలు అక్కరమాని విజయనిర్మలను కూర్చోబెట్టారు. ఆ తరువాత ఎన్నికలకు మూడు నెలల ముందు సనపల రాజమౌళికి ఆ కుర్చీ అప్పగించారు. వైసీపీ నాయకులు వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా లేఅవుట్లకు సంబంధించిన పనులన్నీ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా పనిచేసిన వారితో చక్కగా చేయించుకున్నారు. కొత్తగా రూపొందించిన వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే రాజు, చిన్న శ్రీను తదితరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రస్తుత చైర్మన్‌ సనపల నగరంలో లేరు. అయితే అధికారులు ముందుగానే రాజీనామా లేఖను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు సమాచారం. ఆయన రాగానే సంతకం చేయించుకోవాలని చూస్తున్నారు.

కాయల వెంకటరెడ్డికి ఏపీ మేరీటైమ్‌ బోర్డు చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఒకసారి పదవీ కాలం ముగిసిపోగా మరోసారి పొడిగింపు ఇచ్చారు. వివిధ సంస్థల నుంచి బోర్డు పేరుతో రుణాలు తెచ్చి ప్రభుత్వ ఖాతాలకు మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఆ సంస్థ ప్రగతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు. ఆయన ఇంకా పదవికి రాజీనామా చేయలేదు.

విశాఖపట్నం-కాకినాడ పెట్రో రసాయన పెట్టుబడుల ప్రాంతం (పీసీపీఐఆర్‌) చైర్‌పర్సన్‌ పదవి ముందు చొక్కాకుల వెంకటరావు భార్య లక్ష్మీకి ఇచ్చారు. ఇటీవల పదవీ కాలం ముగిసిపోగా నేరుగా వెంకటరావునే ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన కూడా ఇంకా పదవికి రాజీనామా సమర్పించలేదు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ పదవి తొలుత కొండా రాజీవ్‌గాంధీ సోదరికి ఇచ్చారు. ఆరు నెలల క్రితం పదవీకాలం ముగిసిపోగా నేరుగా ఆయనకే అప్పగించారు. ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయడమే ప్రధాన విధిగా మొదటి నుంచి ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే పార్టీ పెద్దల దృష్టిలో పడి...అదే పంథా కొనసాగించారు. ఇంకా పదవి పట్టుకొని వేలాడుతున్నారు.

విశాఖపట్నం పార్టీ సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు పరవాడకు చెందిన గెడ్డం ఉమకు మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చారు. పార్టీకి చేసిన సేవలు ఏమిటంటే...స్థానిక నాయకులకే ఆమె తెలియదనేది క్షేత్రస్థాయిలో వినిపించే మాట. ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా జగన్‌ను పొగడడం, పార్టీ పెద్దలు వచ్చినప్పుడు విమానాశ్రయానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు ఇవ్వడమే ఆమె చేసిన సేవ అని చెబుతున్నారు. ఇంకా రాజీనామా చేయలేదు.

ఇకపోతే కార్పొరేషన్లు, వివిధ విశ్వవిద్యాలయాలలో డైరెక్టర్లుగా, వివిధ దేవస్థానాలకు ట్రస్టు బోర్డు సభ్యులుగా పలువురు పదవులు తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి పదవులు పొందిన వారి సంఖ్య వంద వరకూ ఉంటుంది. వారంతా వైసీపీ ఓడిపోయిన వెంటనే రాజీనామా చేయాలి. కానీ ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 01:02 AM