Share News

‘దేశం’ కంచుకోట ‘సౌత్‌’

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:14 AM

విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది.

‘దేశం’ కంచుకోట ‘సౌత్‌’

నియోజకవర్గం ఏర్పడిన తరువాత మూడుసార్లు ఎన్నికలు

రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గెలుపు

2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ...అయినా టీడీపీ అభ్యర్థి విజయం

తాజా ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపు

ఉమ్మడి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌

గెలుపు నల్లేరుమీద నడకేనని కూటమి నేతల్లో విశ్వాసం

మరోవైపు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపు...ఆ తరువాత వైసీపీలోకి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన ‘సౌత్‌’ 2009లో ఇప్పటివరకూ మూడుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి విజయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అడ్డుకోలేకపోయారు. తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ను పోటీకి దింపాయి. నియోజకవర్గ గత చరిత్రను బట్టి చూస్తే కూటమి అభ్యర్థి విజయం నల్లేరుమీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణ నియోజకవర్గంలో ముస్లింలు, క్రైస్తవులు, మత్స్యకారులు, బ్రాహ్మణులు, కాపులు, వెలమ, చేనేత (పద్మశాలి), యాదవులతో పాటు మార్వాడీలు ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌, ప్రజారాజ్యం పార్టీ నుంచి కోలా గురువులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 11 మంది పోటీ చేశారు. అప్పటికి నియోజకవర్గంలో 1,74,557 మంది ఓటర్లు ఉండగా, 1,28,907 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 45,971 (35.66 శాతం) కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావుకు దక్కగా, ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థి కోలా గురువులుకు 45,630 లభించాయి. దీంతో 341 ఓట్లు స్వల్ప తేడాతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,97,541కి పెరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరిగి వాసుపల్లి గణేష్‌కుమార్‌, వైసీపీ నుంచి కోలా గురువులు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు 66,686 (51.45 శాతం) ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోలా గురువులుకు 48,370 (37.32 శాతం), కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌కి 8,280 (6.39 శాతం) ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ 18,316 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మళ్లీ వాసుపల్లి గణేష్‌కుమార్‌, వైసీపీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌, జనసేన నుంచి గంపల గిరిధర్‌, బీజేపీ నుంచి కొప్పల రామ్‌కుమార్‌ పోటీ చేశారు. నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,09,356కు పెరిగినప్పటికీ 1,25,701 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు 52,172 (41.5 శాతం) ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌కు 48,443 (38.15 శాతం) ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి గంపల గిరిధర్‌కు 18,119 (14.41 శాతం) ఓట్లు, బీజేపీ అభ్యర్థి కొప్పల రామ్‌కుమార్‌ 2,397 (1.91 శాతం) దక్కాయి. దీంతో వరుసగా రెండోసారి కూడా విజయం టీడీపీ అభ్యర్థినే వరించింది. తాజాగా వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన వంశీకృష్ణశ్రీనివాస్‌ బరిలో నిలవగా, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు.

వాసుపల్లికి ముప్పేట వ్యతిరేకత

వైసీపీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే ఓడిస్తామంటూ ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు సమావేశమై అధికార పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా వాసుపల్లి నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఇదే కారణంతో కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆ పార్టీని వీడారు. కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో మంచి పట్టు కలిగిన సీతంరాజు సుధాకర్‌ నిన్నమొన్నటి వరకూ వైసీపీలో ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీకి రాజీనామా చేశారు. కూటమి అభ్యర్థి వంశీకృష్ణశ్రీనివాస్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన నేడో, రేపో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు చెబుతున్నారు.

వీటన్నింటితోపాటు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ వ్యతిరేక ఓటు కూడా ఆయా పార్టీల మధ్య చీలిపోయింది. టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు 52,172 (41.5 శాతం), జనసేన పార్టీ అభ్యర్థి గంపల గిరిధర్‌కు 18,119 (14.41 శాతం) ఓట్లు, బీజేపీ అభ్యర్థి కొప్పల రామ్‌కుమార్‌ 2,397 (1.91 శాతం) పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌కు 48,443 (38.15 శాతం) ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలివీ చినప్పుడే దక్షిణ నియోజకర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. పైగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాయి. గత ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు లభించిన ఓట్లు కలిపితే 72,688 (58 శాతం). ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం తథ్యమని కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 02:14 AM