Share News

అంకితభావంతో కౌంటింగ్‌ విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:47 AM

ఓట్ల లెక్కింపు ప్రక్రియను అంకితభావంతో నిర్వహించాలని కౌంటింగ్‌ పరిశీలకులు కె.వివేకానందన్‌, గజేంద్రకుమార్‌సింగ్‌ సూచించారు.

అంకితభావంతో కౌంటింగ్‌ విధులు నిర్వహించాలి
మాట్లాడుతున్న కౌంటింగ్‌ పరిశీలకుడు కె.వివేకానందన్‌

కౌంటింగ్‌ అధికారులు, సిబ్బందికి కౌంటింగ్‌ పరిశీలకులు కె.వివేకానందన్‌, గజేంద్రకుమార్‌ సింగ్‌ సూచన

పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల కౌంటింగ్‌ అధికారులతో వేర్వేరుగా సమావేశాలు

పాడేరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపు ప్రక్రియను అంకితభావంతో నిర్వహించాలని కౌంటింగ్‌ పరిశీలకులు కె.వివేకానందన్‌, గజేంద్రకుమార్‌సింగ్‌ సూచించారు. జిల్లాలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్‌ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో సోమవారం వారిద్దరూ వేర్వేరుగా సమావేశాలను నిర్వహించి కౌంటింగ్‌ సందర్భంగా అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు విధులు నిర్వహించాలన్నారు. ఈవీఎంలు తరలించే సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ ఉంటుందని, వారికి సైతం నంబర్లు కేటాయిస్తారన్నారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని పరిశీలకుడు వివేకానందన్‌ పేర్కొన్నారు. అరకులోయ, పాడేరు అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగేతర అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. మూడో విడత ర్యాండమైజేషన్‌ చేపట్టి కౌంటింగ్‌ సిబ్బందికి టేబుళ్లను కేటాయిస్తారన్నారు. 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులపై అభిషేక్‌ స్పష్టంగా వివరించారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో కె.చైతన్య, పాడేరు ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌వో బి.పద్మావతి, ఎస్‌డీసీ వీవీఎస్‌శర్మ, రెండు నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:47 AM